

హైదరాబాద్: లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. దీంతో నెల రోజుల సుదీర్ఘ పర్యటనకు భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు రిక్తహస్తంతో స్వదేశానికి తిరిగి వెళ్లనుంది.
ఇప్పటికే భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో పోరాట పటిమను చూపించిన విండిస్, రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో రెండో టీ20లో భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో ఇంకో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది వరసగా ఏడో సిరీస్ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
అనంతరం 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో షాయి హోప్(6) ఔటయ్యాడు. ఒక చక్కటి బంతితో హోప్‌ను ఖలీల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ షిమ్రోన్ హెట్మేయర్(15)ను కూడా ఖలీల్ అహ్మదే పెవిలియన్‌కు పంపాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో (23) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. కానీ అతనికి సహ క్రికెటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. అదే సమయంలో బ్రావోను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ అందుకోవడంతో బ్రావో పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండిస్ ఆటగాళ్లు రామ్‌దిన్(10), పూరన్(4), పొలార్డ్(6), అలెన్(0) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డారెన్ బ్రావో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. విండీస్ బౌలర్లలో ఒషానె థామస్, కీమో పాల్ చెరో వికెట్ తీశారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 నవంబర్ 11న చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగనుంది.