కటక్: దక్షిణాఫ్రికాపై రెండో ట్వంటీ20 మ్యాచులో భారత్ బ్యాట్స్‌మెన్ చెత్త బ్యాటింగ్‌కు తీవ్ర నిరాశకు గురైన అభిమానులు సోమవారం రాత్రి మైదానంలోకి ప్లాస్టిక్ బాటిల్స్ విసిరారు. అభిమానుల ఆందోళనతో మ్యాచ్ రెండుసార్లు ఆగిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ తన బౌలర్లతో భారత బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించాడు.
భారత్ 17.2 ఓవర్లలో కేవలం 92 పరుగులకే తోక ముడిచింది. మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్‌లో భారత్ ఈ మ్యాచును గెలవాల్సిన పరిస్థితిలో ఉండింది. తొలి టీ20 మ్యాచులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ, సురేష్ రైనా 22 పరుగులేసి చేయగా, శిఖర్ ధావన్, ఆర్ అశ్విన్ 11 పరుగులేసి చేశారు. బారాబతి స్టేడియంలో తొలి ట్వంటీ20 మ్యాచ్ అది. దాంతో మైదానం ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది. మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి కనిపించడంతో మధ్యలోనే అభిమానులు మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు.
తీవ్రమైన ఆందోళనకు దిగిన అభిమానులను శాంతపరచడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పది నిమిషాల్లో ప్రేక్షకులను పోలీసులు నియంత్రించారు. భారత్‌కు ట్వంటీ20లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2008లో భారత్ ఆస్ట్రేలియాపై 74 పరుగులు చేసింది. ఇప్పటి వరకు భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే.