281 గొప్ప ఇన్నింగ్సే కానీ, సిడ్నీలో చేసిన 167 ఎంతో ముఖ్యం: లక్ష్మణ్


హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ టెస్టు చరిత్రను ఓ మలుపు తిప్పిన ఆటగాడు. లక్ష్మణ్ అనగానే 2001లో ఆస్ట్రేలియాతో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులో 281 పరుగుల గొప్ప ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది. అయితే, 281 పరుగుల ఇన్నింగ్స్ కంటే 2000లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 167 పరుగులతో చేసిన తొలి టెస్టు సెంచరీని తన కెరీర్‌ను నిలబెట్టిన ఇన్నింగ్స్ అని లక్ష్మణ్ అన్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ '281 అండ్ బియాండ్' పుస్తకావిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన చారిత్రక టెస్టుమ్యాచ్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని లక్ష్మణ్ అన్నాడు.
281 పరుగులు ఎప్పటికీ మధురమైన ఇన్నింగ్సే
"ఈడెన్‌గార్డెన్స్ టెస్టులో నేను బాదిన 281 పరుగులు ఎప్పటికీ మధురమైన ఇన్నింగ్సే. కానీ, సిడ్నీలో సాధించిన 167 పరుగుల ఇన్నింగ్స్ నా తొలిటెస్టు సెంచరీ. అంతకంటే ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో సత్తా చాటగలనన్న ఆత్మవిశ్వాసాన్ని ఈ సెంచరీ నాకు ఇచ్చింది. నిజం చెప్పాలంటే 281 పరుగుల ఇన్నింగ్స్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు" అని లక్ష్మణ్ అన్నాడు.
శారీరకంగా, మానసికంగా ఎంతో మెరుగ్గా సన్నద్ధమయ్యా
"ఈ సిరీస్‌కు ముందు నేను శారీరకంగా, మానసికంగా ఎంతో మెరుగ్గా సన్నద్ధమయ్యా. అథ్లెటిక్స్ కోచ్ ఎన్ రమేశ్ నా ఫిట్‌నెస్ స్థాయిని ఎంతో పెంచారు. అందుకే కోల్‌కతాలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలిగాను" అని తెలిపాడు. జాతీయజట్టులో చోటు కోసం తనకిష్టమైన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నానని చెప్పాడు.

భారత జట్టులో ఆడటం తనకు గర్వకారణం
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు నిండిన ఆనాటి భారత జట్టులో ఆడటం తనకు గర్వకారణంగా ఉందని లక్ష్మణ్ అన్నాడు. ఆ సమయంలో జట్టు మిడిలార్డర్‌లో ఆడటాన్ని ఆస్వాదించానని వెల్లడించారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాలన్న నిర్ణయం ఎంతో కఠినమైదని లక్ష్మణ్ తెలిపాడు.
లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన మంత్రి కేటీఆర్
అనంతరం కేటీఆర్ భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ చీఫ్‌కోచ్ పుల్లెల గోపీచంద్ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఎంతో పేరు తెచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ "క్రికెట్‌లో లక్ష్మణ్, బ్యాడ్మింటన్‌లో గోపీచంద్ అసమాన ఆటతీరుతోపాటు ఎంచుకున్న కెరీర్‌లో సాధించిన విజయాలతో ఎంతో మంది యువ వర్థమాన క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచారు" అని కొనియాడాడు.

క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడంతో పాటు
"క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడంతో పాటు ప్రంపంచంలోని మేటి క్రీడాకారులపై విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసం కలిగించేలా మన క్రీడాకారుల ఆలోచన విధానంలోనూ మార్పులు తీసుకువచ్చారు. టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు ప్రపంచంలోని అతుత్తమ ప్లేయర్లుగానే కాదు, ఎవరినైనా ఓడించగలమని నిరూపించారు" అని అన్నారు.

లక్ష్మణ్ ఇష్టమైనా రాహుల్ ద్రవిడ్‌కు వీరాభిమాని
క్రికెట్‌లో హైదరాబాదీ లక్ష్మణ్ ఇష్టమైనా తాను మాత్రం ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు వీరాభిమాని. కోల్‌కతాలో వీవీఎస్ చారిత్రక 281 ఇన్నింగ్స్ ఆడిన టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమెరికాలో ఉండి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడలేకపోయాను. రెడిఫ్ వెబ్‌సైట్‌లో మ్యాచ్ అప్‌డేట్స్ చూసేవాడిని, క్రికెట్ గురించి అన్ని కాలమ్స్ తప్పకుండా చదివేవాడినని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ సంస్థ ద్వారా లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ
లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ సంస్థ పబ్లిష్ చేసింది. అంతేకాదు వెస్ట్‌ల్యాండ్ స్పోర్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ప్రఖ్యాత స్పోర్ట్ జర్నలిస్ట్ ఆర్ కౌషిక్ సహ రచయితగా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ రచయిత కౌశిక్, బ్యాడ్మింటన్ చీఫ్‌కోచ్ గోపీచంద్, మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు, అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్, లక్ష్మణ్ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications