హైదరాబాద్: క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. టెస్టులు, వన్డేలు కలుపుకొని వంద సెంచరీలు సాధించాడు. అంతేకాదు క్రికెట్‌లో తన పేరిట ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పాడు. అలాంటి సచిన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేసింది ఆగష్టు 14నే. ఇంగ్లండ్ గడ్డ మీద 1990లో సరిగ్గా ఇదే రోజు సచిన్ తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో సెంచరీతో కదం తొక్కిన సచిన్ ఆ టెస్టులో భారత జట్టుని ఓటమి నుంచి గటెక్కించాడు. ఈ టెస్టులో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్‌కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు.

ఈ మ్యాచ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ డకౌట్ కాగా, రవిశాస్త్రి 12, సంజయ్ మంజ్రేకర్ 50 పరుగులు చేసిన పెవిలియన్ చేరారు. ఇక వెంగ్ సర్కార్ 32 పరుగులకే వెనుదిరిగాడు. 109 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న టీమిండియాను సచిన్ ఆదుకున్నాడు.
కెప్టెన్ అజహరుద్దీన్ 11 పరుగులు వద్ద పెవిలియన్‌కు చేరినప్పటికీ.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడంతో వచ్చిన లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న సచిన్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 189 బంతులను ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
67 పరుగులతో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని సచిన్ బరిలో దిగిన సచిన్.. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 17 ఏళ్ల 112 రోజుల వయసులో ఈ సెంచరీ సాధించడం విశేషం.
అంతేకాదు ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ప్రపంచ క్రికెట్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు పాక్‌కు చెందిన ముస్తాఖ్ మహ్మద్ ఉన్నాడు. 17 ఏళ్ల 80 రోజుల వయసులో అతడు సెంచరీ సాధించాడు.