అల్ జజీరా సంచలనం: 2011-12 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఫిక్సయ్యాయి

దుబాయి: క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లలో కొందరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా అల్ జజీరా ఛానెల్ ఓ డాక్యుమెంటరీలో సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు 2011-12 మధ్యకాలంలో ఏకంగా 15 మ్యాచ్‌ల్లో ఆ ఆటగాళ్ల ద్వారా 26 స్పాట్ ఫిక్సింగ్ సంఘటనలు జరిగాయని ఆ ఛానెల్ పేర్కొంది.
ఇందులో 6 టెస్టులు, 6వన్డేలు, 3 ప్రపంచ టీ20లు ఉన్నాయి. ఇందులో ప్రతిష్టాత్మక లార్డ్స్ (2011)లో జరిగిన భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కూడా ఉన్నట్లు "క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్" పేరుతో అల్ జజీరా ఓ పరిశోధనత్మాక డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో మునావర్ 26సార్లు ఫిక్సింగ్‌కు ప్రయత్నించగా 25సార్లు విజయం సాధించాడని తెలిపింది.

2011 వన్డే ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు
వీటిలో ఏడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు, ఐదు మ్యాచ్‌ల్లో ఆసీస్ ప్లేయర్లకు, మూడు మ్యాచ్‌ల్లో పాక్ క్రికెటర్లకు సంబంధం ఉందని స్పష్టం చేసింది. 2011లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్, 2011 వన్డే ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు, 2012 శ్రీలంకలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురైనట్లు ఫొటోలు, రికార్డింగ్‌లతో సహా జజీరా బయటపెట్టింది. మునావర్.. తనకింద పనిచేసే దినేశ్ ఖల్గీ (అహ్మదాబాద్ కేంద్రంగా)తో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఈ డ్యాకుమెంటరీలో ఆల్ జజీరా ఛానెల్ వెల్లడించింది.

మీకు చెల్లించాల్సిన చివరి పేమెంట్ సిద్ధంగా ఉంది
వీరిద్దరూ కలిసి శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌తో పాటు మరో రెండింటిని ఫిక్స్ చేసినట్లు ఆ సంభాషణలో తేలింది. ఇక, 2011 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు మునావర్.. పేరు తెలియని ఓ ఇంగ్లండ్ క్రికెటర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాటలను యధాతధంగా బయటపెట్టింది. "యాషెస్ సిరిస్ ఆడుతున్నందుకు అభినందనలు. మీకు చెల్లించాల్సిన చివరి పేమెంట్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అని" మునావర్ చెప్పగా.. సదరు క్రికెటర్ లవ్లీ అంటూ స్పందించినట్లుగా సంభాషణల్లో స్పష్టమైంది.

పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ జరిపిన సమావేశానికి
2012లో యూఏఈ వేదికగా పాక్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల్లోనూ ఫిక్సర్లు విజయం సాధించారని వెల్లడించింది. ఇందుకు సంబంధించి డీ-గ్యాంగ్ ప్రతినిధులతో పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ జరిపిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టింది. దుబాయ్‌లో పాక్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా ఓ రాత్రి హోటల్ లాబీలో ఈ సమావేశం జరిగినట్లు వెల్లడించింది. ఈ ఫోటోల్లో రెండో వ్యక్తి ఇచ్చిన ఓ బ్యాగ్‌ను ఉమర్ అక్మల్ నిశితంగా పరిశీలించినట్లు కూడా ఆ ఫొటోల్లో ఉంది.

ఆల్ జజీరా స్టింగ్ ఆపరేషన్‌పై కాస్త సందేహాలు
అయితే ఆ బ్యాగ్‌ను అక్మల్ తీసుకెళ్తున్నట్లు ఫొటోలలో ఎక్కడ లేకపోవడంతో ఆల్ జజీరా స్టింగ్ ఆపరేషన్‌పై కాస్త సందేహాలు నెలకొన్నాయి. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ ఏడాది జూన్‌లో అక్మల్‌కు పీసీబీ అవినీతి నిరోధక యూనిట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ ముందు హాజరైన అక్మల్ హాంకాంగ్ సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో రెండు డాట్ బాల్స్ ఆడితే రెండు లక్షల డాలర్లు ఇస్తామని ఫిక్సర్లు తనను సంప్రదించినట్లు వెల్లడించాడు. అలాగే 2015 వరల్డ్ కప్‌లో భారత్‌తో గ్రూప్ మ్యాచ్‌కు ముందు కూడా ఇదే విధంగా జరిగిందని అన్నాడు.

తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చిన సీఏ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
యూఏఈలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా ఫిక్సర్లు సంప్రదించారని చెప్పడంతో విచారణ కోసం పీసీబీ సమన్లు జారీ చేసింది. ఆల్ జజీరా రూపొందించిన డ్యాకుమెంటరీపై ఐసీసీ ఏసీయూ జనరల్ మేనేజర్ చీఫ్ అలెక్స్ మార్షల్ స్పందించాడు. ఆధారాలు ఇచ్చి సహకరిస్తే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నాడు. మరోవైపు ఈ ఆరోపణలపై ఐసీసీ విచారణకు ఆదేశించగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చాయి. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లలో ఎవరూ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలలేదని వెల్లడించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications