న్యూఢిల్లీ : క్రికెటర్ గా ధోనిని ప్రభావితం చేసిన అత్యంత క్లిష్టమైన సందర్బమేంటో తెలుసా? అదే సందర్భం.. ఆ తర్వాత ధోనిని ఓ అత్యుత్తమ క్రికెటర్ గా తీర్చిదిద్దిందన్న సంగతి తెలుసా?.. స్వయంగా ధోనినే వెల్లడించాడు కాబట్టి.. ఇప్పుడీ విషయాలన్ని హాట్ టాపిక్ గా మారాయి.
ధోనిని అంతగా ప్రభావితం చేసిన సందర్బం.. 2007 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా వైఫల్యం. వెస్టిండీస్ లో జరిగిన ఆ ప్రపంచకప్ లో నాకౌట్ దశలోనే ఇంటిబాట పట్టింది టీమ్ ఇండియా. ఆడిన మూడు మ్యాచుల్లో టీమ్ ఇండియా రెండింటిల్లో ఓడిపోగా.. బంగ్లాదేశ్‌పై 191 పరుగులకే ఆలౌటై ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ ను చేజార్చుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఆ తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన టీమ్ సభ్యులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇళ్లలో దిగబెట్టారు పోలీసులు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎయిర్‌పోర్ట్ నుంచి తాను, సెహ్వాగ్ పోలీస్ వ్యాన్‌లో వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు ధోని. అప్పటికీ చీకటి పడిందని.. అయినా మీడియా వాళ్లు కార్లు మాత్రం పెద్ద పెద్ద లైట్లతో తమ హహనాలను ఫాలో అవడం ఇప్పటికీ మరిచిపోలేనని గుర్తు చేశాడు ధోని.
ఆ సమయంలో.. 'తామేదైనా నేరం చేశామా?, హత్య చేశామా?, లేక ఉగ్రవాదులమా?' అనిపించే విధంగా అప్పటి పరిస్థితి ఉందన్నాడు ధోని. పోలీస్ స్టేషన్ల వద్ద కొంతసేపు ఆగి ఆ తర్వాత తమ ఇళ్లకు బయలుదేరినట్టు అప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. అయితే అదే సంఘటన తనను బెటర్ క్రికెటర్ ను చేసిందని వివరించాడు.
'ఎమ్మెస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరి' సెప్టెంబర్ 30న విడుదల కానున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ధోని ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు.