బెంగళూరు: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా బుధవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన ఒక్క పరుగు తేడాతో గెలిచింది. దీనిపై ధోనీ స్పందిచాడు. 2007 ప్రపంచ కప్‌లో తాము బంగ్లా చేతిలో ఓడిపోయిన మ్యాచ్ చాలా బాధాకరమన్నాడు.
ఇప్పుడు ఒక్క పరుగుతో ఉత్కంఠగా గెలిచినంత మాత్రాన నాటి మ్యాచ్ బాధ మరిచిపోలేమన్నాడు. తాజా గెలుపు గత గాయాలను మాన్చలేవని అభిప్రాయపడ్డాడు. 2007లో ఓడిపోయిన మ్యాచ్ ఇప్పటికీ గుర్తుందని, అది బాధిస్తుంటుందని చెప్పాడు.
Also Read: క్రికెట్లో ఇదో అద్భుతం!: భారత్-బంగ్లా మ్యాచ్, కీలక మలుపులివే (పిక్చర్స్)
మేం అప్పుడు చాలా బాగా ఆడామని, అయినప్పటికీ బంగ్లాదేశ్‌తో ఓటమితో క్వాలిఫై కాలేకపోయామన్నాడు. పోర్ట్ స్పెయిన్‌లో నాడు జరిగిన మ్యాచులో ధోనీ సేన బంగ్లా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ డకౌట్ అయ్యాడు.

ఇలా జరుగుతుందనుకోలేదు: బంగ్లా కెప్టెన్ మోర్తజా
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి మూడు బంతుల కారణంగానే తాము ఓడిపోయామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తాజా వ్యాఖ్యానించాడు. మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే విజయం ఖాయమన్న సమయంలో నాలుగు వికెట్లు చేతుల్లో ఉండి కూడా తాము లక్ష్యాన్ని చేరుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒత్తిడిలో తమ ఆటగాళ్లు సింగిల్స్ కోసం ప్రయత్నించకుండా షాట్లు ఆడేందుకు ప్రయత్నించడమే ఓటమికి కారణమన్నాడు. చివరి మూడు బంతులకు ముందు వరకూ విజయం తమ వైపే ఉందని, మేము సింగిల్స్ తీసి ఉండాల్సిందని, కానీ బ్యాడ్ లక్ అన్నాడు. మేం మూడు వికెట్లు కోల్పోయాని, ఇది నిజంగా దురదృష్టమే అన్నాడు. మొత్తం మీద పాకిస్తాన్ పైన మినహా మిగతా మ్యాచ్‌లలో బాగా ఆడామని, ఈ రోజు మాది కాదన్నాడు.