
హైదరాబాద్: కోల్‌కతా హోటల్‌కు చెందిన మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఢిల్లీకి అండర్-23 జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ డిస్ట్రిక్ అండ్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) శుక్రవారం ఇంటికి పంపించింది. టీమ్ మేనేజర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ క్రికెటర్ల భవిష్యత్‌పై నిర్ణయం తీసుకంటామని డీడీసీఏ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాల్లోకి వెళితే... సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు కోల్‌కతాకు వెళ్లింది. స్థానికంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఢిల్లీ క్రికెటర్లు పాల్గొన్నారు. అనంతరం కుల్దీప్ యాదవ్, లక్షయ్ తారేజా అనే ఇద్దరు క్రికెటర్లు కొంతమంది మహిళలను వెంబడిస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఆ మహిళ హోటల్‌కు చెందిన మహిళా ఉద్యోగి కావడంతో... హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఆ క్రికెటర్లను బయటకి పంపించేశారు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. అయితే, నష్టనివారణ చర్యల్లో భాగంగా డీడీసీఏ తన డైరెక్టర్ సంజయ్ భరద్వాజ్‌ను కోల్‌కతాకు పంపించింది.
అదే సమయంలో ఆ ఇద్దరు క్రికెటర్లను వెంటనే ఢిల్లీకి రప్పించింది. దీంతో పాటు ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని టీమ్ మేనేజర్‌ను కోరింది. డీడీసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ "సంజయ్ భరద్వాజ్ కోల్‌కతాలో ఉన్నారు. ఈ రోజు బెంగాల్‌తో జరిగే మ్యాచ్‌లో ఇద్దరు కుర్రాళ్ళు ఆడటం లేదు. వారిని ఇంటికి తిరిగి పంపుతున్నాం" అని తెలిపారు.
"వీరి స్థానంలో మరో ఇద్దరి ఆటగాళ్లను కోల్‌కతాకు డీడీసీఏ పంపించింది. హోటల్ మహిళా సిబ్బంది తలుపుతు తట్టారని... సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. అదృష్టవశాత్తూ, హోటల్ అధికారులకు ఆ ఇద్దరూ క్షమాపణలు చెప్పడంతో పోలీసు కేసు నమోదు కాలేదు" అని అన్నారు.