ఛాలెంజింగ్ పిచ్: ఈరోజు మాది కాదన్న కుంబ్లే
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పూణె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ విజయవంతమైన దశలోనూ ఓ ప్రతికూలమైన రోజు ఉంటుందని అన్నాడు.
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న టీమిండియా పూణె టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే టీమిండియాను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు.

ఈ రోజు మనదికాదని, బాగా నిరాశకు గురయ్యాం
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పూణె స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు క్లిష్టతరమైనదని, రెండోరోజు శుక్రవారం ఆటలో రాహుల్ అవుటయ్యాక దురదృష్టవశాత్తూ వెంటవెంటనే వికెట్లు పడ్డాయని, ఈ రోజు మనదికాదని, బాగా నిరాశకు గురి చేసిందని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

రాహుల్, రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి స్థితిలో ఉన్నాం
'అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. ఇదో చెడ్డ రోజు. బాగా నిరాశ కలిగించింది. రాహుల్, రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేం మంచి స్థితిలో ఉన్నాం. రాహుల్ ఔటైన తర్వాత ఐదారు బంతుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయాం. ఇది బాగా దెబ్బతీసింది. పిచ్ బాగా టర్న్ అయ్యింది. మేం కాస్త నిలకడ చూపితే బాగుండేది. ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయాలంటే దూకుడుతో పాటు అప్రమత్తత కూడా చాలా అవసరం. ఓవరాల్‌గా ఇదో పీడకల. మేం సమష్టిగా విఫలమయ్యాం' అని కుంబ్లే అన్నాడు.

ఆఖరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలోనే
పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామం అనంతరం టీమిండియా ఆఖరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్ పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్టీవ్ ఒకీఫీ మాత్రం సత్తా చాటాడు.

6/35: టెస్టుల్లో ఒకీఫీ అత్యుత్తమ ప్రదర్శన
ఈ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఒకీఫీ 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఒకీఫీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం కూడా ఇదే తొలిసారి. మరోవైపు టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డుని నమోదు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications