న్యూఢిల్లీ: నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించేలా ఆదేశాలివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిధుల విడుదల ఆగిపోవడంతో బుధవారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని బీసీసీఐ కోర్టుకు తెలిపింది.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బుధవారం నుంచి తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. కాగా, లోధా కమిటీ సిఫార్సులను అమలుకు సంబంధించి స్పష్టత వచ్చే వరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బిసిసిఐ నిధుల విడుదల కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించి హోటల్, ప్రయాణపు ఖర్చులను మీరే భరించాలంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లో బుధవారం జరిగే తొలి టెస్టుకు తగినన్ని నిధులు విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును బిసిసిఐ కోరింది.
తమకు విడుదల చేసే నిధులపై ఆంక్షలను సడలించాలని విన్నవించింది. ఈ మేరకు బిసిసిఐ వేసిన పిటిషన్ పై విచారణ మంగళవారం జరగనుంది.