సిడ్నీలో సెంచరీతో అనేక రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ(133) జట్టును గెలిపించలేక పోయినప్పటికీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ 22వ సెంచరీ కావడం విశేషం.
అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మూడు సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు. 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు.

ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు
ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించిన రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి విజయం కోసం పోరాడాడు. ఓ ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ... ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించాడు. వరుసగా పదో సిరీస్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో 22వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

గంగూలీతో సమానం
దీంతో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీతో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్, కోహ్లి మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు. మొత్తంగా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మకు ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. దీంతో ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాడిగా రోహిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఎక్కువ సెంచరీలు బాదిన జాబితాలో
దీంతో పాటు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డేల్లో ఎక్కువ సెంచరీలు బాదిన జాబితాలో సచిన్ టెండూల్కర్(9)ది అగ్రస్థానం కాగా.. రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్ మ్యాన్ మూడోస్థానానికి చేరుకున్నాడు.

రోహిత్ అరుదైన రికార్డు
ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసీస్‌పై 3077 పరుగులు చేయగా.. పాంటింగ్ భారత్‌పై 2164 పరుగులు చేశాడు. రోహిత్ ఇప్పటి వరకూ 1725 పరుగులు సాధించాడు. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ప్రతి ఏడాది భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ
వన్డేల్లో అత్యధిక 125పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (19) తర్వాతి స్థానంలో రోహిత్ (14) నిలిచాడు. కోహ్లీ (13)ను హిట్ మ్యాన్ వెనక్కి నెట్టాడు. ఇక, రోహిత్ శర్మ ఛేజింగ్‌లో పది సెంచరీలు చేయగా.. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే భారత్ ఓటమి పాలైంది. 2015 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ బాదిన ఆటగాడు రోహితే శర్మే కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications