MI vs RCB: అలా జరగకుండా ఉండాల్సింది! నా మొదటి మ్యాచే.. చివరి మ్యాచ్ కావొచ్చు!!

చెన్నై: ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్.. ఐపీఎల్ 2020లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఉండడంతో.. ఆసీస్ హిట్టర్ లిన్ అవసరం లేకుండా పోయింది. అయితే 2021 సీజన్‌కు డికాక్ లేటుగా రావడంతో ప్రస్తుతం అతడు క్వారంటైన్ గడుపుతున్నాడు. దీంతో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి లిన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్ రనౌట్ అయ్యాడు.

రోహిత్ రనౌట్:
ముంబై ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ విసిరిన చివరి బంతిని పాయింట్, కవర్స్ ఫీల్డర్ల మధ్యలో నుంచి క్రిస్ లిన్ హిట్ చేశాడు. దాంతో సింగిల్ కోసం రోహిత్ శర్మని పిలిచిన లిన్.. ఆపై మనసు మార్చుకున్నాడు. లిన్ పరుగు కోసం పిలవగానే.. రోహిత్ వేగంగా పిచ్ మధ్యలోకి పరుగెత్తకుంటూ వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు. దీంతో లిన్.. రోహిత్‌ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన రోహిత్ మళ్లీ క్రీజులోకి వెళ్లలేకపోయాడు. బంతిని అందుకున్న కోహ్లీ చాకచక్యంగా బౌలర్ చహల్‌కి అందివ్వడంతో.. అతడు వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ (19: 15 బంతుల్లో 1x4, 1x6) రనౌటయ్యాడు.

కెప్టెన్ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని:
రోహిత్ శర్మ రనౌట్ విషయంపై మ్యాచ్ అనంతరం క్రిస్ లిన్ మాట్లాడాడు. 'నేను కొంచెం భయపడ్డాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముంబైకి ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం కూడా తొలిసారే. దీంతో తొలుత కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. నిజానికి ఆ బంతికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్ అయ్యాడు. ఒకవేళ అవకాశం ఉంటే.. కెప్టెన్ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని' అని క్రిస్ లిన్ తెలిపాడు.

చివరి మ్యాచ్ అవుతుందేమో:
'ఏదేమైనా ఇలా రనౌట్ జరగకుండా ఉండాల్సింది. రోహిత్ శర్మ విషయంలో పెద్ద తప్పిదం జరిగిపోయింది. అయితే ఆటలో ఇవన్ని మామూలే. ఒకవేళ రోహిత్ క్రీజులో ఉంటే 15-20 పరుగులు చేసేవాడేమో. అప్పుడు మ్యాచ్ ఫలితం కూడా మరోలా ఉండేది కావొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో. ఏదేమైనా మేము 10 లేదా 15 పరుగులు తక్కువగా చేసాం. ఇది కాకుండా కొన్ని తప్పులు కూడా చేశాం. మ్యాచ్ చివరి బంతికి తీసుకెళ్లిన ఘనత బౌలర్లదే' అని క్రిస్ లిన్ అన్నాడు. లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు.

ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు విజయం:
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో నయా సంచలనం హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో అల్లాడించగా.. బ్యాటింగ్‌లో రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ దంచికొట్టడంతో బెంగళూరు సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే ముంబై తన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications