17 ఏళ్ల వయసులోనే 17 ఏళ్ల నిరీక్షణకు తెర!
భారత బ్యాడ్మింటన్ స్టార్ తన్వీ శర్మ తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సాధించింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆమె తైపీ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం(ఆగస్టు 2) జరిగిన ఫైనల్ పోరులో తన్వీ శర్మ ఆరో సీడ్ క్రీడాకారిణి అయిన వియత్నాంకు చెందిన థున్ లిన్ గుయెన్‌ను 21-16, 21-16 తేడాతో ఓడించి తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో తైపీ ఓపెన్లో మహిళల సింగిల్స్ గెలిచిన సైనా నెహ్వాల్ తర్వాత తొలి భారత క్రీడాకారిణిగా తన్వీ శర్మ నిలిచింది. 2008 సీజన్లో సైనా నెహ్వాల్ ఇక్కడ టైటిల్ గెలుచుకుంది. దీంతో భారత్ 17 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
ఈ టైటిల్ మ్యాచ్ కేవలం 36 నిమిషాలు మాత్రమే సాగినా.. ఈ మ్యాచ్ తన్వీ కోర్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి గేమ్‌లో అద్భుతమైన నెట్ కంట్రోల్, అద్భుతమైన డ్రాప్ షాట్లు, క్రాస్-కోర్ట్ స్మాష్‌ల పుణ్యమా అని ఆమె ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. మధ్యలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల గుయెన్ పుంజుకునే అవకాశం లభించింది. కానీ తన్వీ శర్మ సంయమనం కోల్పోకుండా మొదటి గేమ్‌ను 21-16 తేడాతో గెలుచుకుంది.

రెండో గేమ్‌లో థున్ లిన్ గుయెన్ దూకుడుగా ప్రారంభించి 3-0 ఆధిక్యం సాధించింది. కానీ తన్వీ శర్మ ఆ ఒత్తిడికి లొంగలేదు. ఆమె సంయమనంతో పోరాడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. నిలకడగా రాణించి తన్వీ శర్మ రెండో గేమ్ ను 21-16 తేడాతో గెలుచుకుంది. వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి టైటిల్ గెలిచింది. ఈ విజయం కేవలం ఓ టైటిల్ మాత్రమే కాదు.. భారత బ్యాడ్మింటన్‌కు ఓ కొత్త ఆశ కూడా. 2008లో సైనా నెహ్వాల్ తైపీ ఓపెన్ గెలిచి భారత మహిళల బ్యాడ్మింటన్‌లో ఓ కొత్త విప్లవాన్ని ప్రారంభించింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత అదే టోర్నీలో తన్వీ శర్మ గెలుచుకున్న టైటిల్.. భారత్ తన తదుపరి మహిళా సింగిల్స్ స్టార్‌ను కనుగొందని సంకేతాలిస్తోంది.
పంజాబ్‌కు చెందిన తన్వీ శర్మ గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది . ఆమె ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలు కూడా ఆమెనే. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారిగా స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో కూడా ఆమె సభ్యురాలు. గతేడాది యూఎస్ ఓపెన్ సూపర్ 300 ఫైనల్‌లో ఓడిపోయిన తన్వి.. ఈసారి ఎలాంటి తప్పులు చేయకుండా టైటిల్ గెలుచుకుంది.
మ్యాచ్ తర్వాత జరిగిన పతకాల ప్రదానోత్సవంలో అత్యంత భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. తన్వి తన మెడలోని బంగారు పతకాన్ని తీసి తన కోచ్ పార్క్ టే-సాంగ్ మెడలో వేసింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు శిక్షణ ఇచ్చిన కోచ్ ఈ పార్క్ టే-సాంగే. ఈ దృశ్యం సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవ్వగా.. తన్వి ఈ భావోద్వేగభరితమైన చర్యను అభిమానులు ప్రశంసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

