బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆసక్తికరంగా సాగింది. వినూత్న రీతిలో 'హ్యాండ్లింగ్ ది బాల్'తో ముష్ఫికర్ రహీమ్ ఔటవ్వడం, అలాగే ఒకే రోజు 15 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకే కుప్పకూలింది.
కివీస్ బౌలర్ల ధాటికి ఆది నుంచే బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు. 29 పరుగులకే ఓపెనర్లు మహ్మదుల్ హసన్ (14), జకీర్ హుస్సేన్ (8) వెనుదిరిగారు. కాసేపటికే మోమినల్ (5), కెప్టెన్ షాంటో (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ముష్ఫికర్ (35), హోస్సేన్ (31) వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే జేమిసన్ వేసిన బంతిని ముష్పికర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి.. బాల్ వికెట్ల మీదకు వస్తుందని చేతితో అడ్డుకున్నాడు. థర్డ్ అంపైర్ 'హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ తో ముష్ఫికర్ ను ఔట్ గా ప్రకటించాడు. ఈ రీతిలో ఔటైన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ గా ముష్ఫికర్ నిలిచాడు.

ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు, అజజ్ పటేల్ రెండు, సౌథి ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి అయిదు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. కాన్వాయ్ (11), లాథమ్ (4), నికోలస్ (1), విలియమ్సన్ (13) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. బ్లండెల్ డకౌటయ్యాడు. కాగా, బంగ్లా బౌలర్లలో మెహిద్ అసన్ మూడు, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి టెస్టులో కివీస్ పై బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.