
హైదరాబాద్: బెంగళూరు వేదికగా గురువారం ప్రారంభమైన చారిత్రాత్మక టెస్టుతో ఆప్ఘనిస్థాన్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు హోదా పొందిన 12వ దేశంగా అవతరించింది. ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది.
తొలిరోజు ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ సెంచరీలు సాధించగా.. లోకేష్ రాహుల్(54) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 347/6 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ ఆటగాడు అశ్విన్(18) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్ ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క‍్రమంలోనే హార్దిక్ పాండ్యా టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఆ తర్వాత కాసపేటికే రవీంద్ర జడేజా(20) ఔట్ కావడంతో 436 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్ పాండ్యా(71) సైతం పెవిలియన్ చేరాడు. చివర్లో ఉమేశ్ యాదవ్(26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది.
ఇషాంత్ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్‌కు ఉమేశ్ యాదవ్ 34 పరుగులు జోడించాడు. భారత బ్యాట్స్‌మెన్ దెబ్బకు టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ టెస్టు ఫార్మాట్లో తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లు వేసిన ఈ అప్ఘాన్ స్పిన్నర్ 154 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఆప్ఘన్ జట్టు టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా రషీద్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ పేరిట ఉండేది. పాకిస్థాన్ 1952లో భారత్‌పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో అమీర్ 134 పరుగులు ఇవ్వగా.. రషీద్.. అంత కంటే ఎక్కువ పరుగులిచ్చాడు.