
రెండేళ్ల కిందట 1009 పరుగులు చేసిన ప్రణవ్ ధన్‌వాడే
ప్రణవ్ ధన్‌వాడే... సరిగ్గా రెండేళ్ల కిందట ఓ స్కూల్ క్రికెట్‌లో 1009 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్‌సీఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల మ్యాచ్‌లో కేసీ గాంధీ హైస్కూల్ తరఫున బరిలోకి దిగిన ప్రణవ్ 323 బంతుల్లో ఏకంగా 1,009పరుగులతో నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అదే ముంబైకే చెందిన మరో కుర్రాడు 1045 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రణవ్ రికార్డును బద్దలు కొట్టాడు.

తనిష్క్ గవాటే 1,045 పరుగులతో సరికొత్త రికార్డు
ఆ కుర్రాడి పేరు నిష్క్ గవాటే కోపర్ కైరానేలోని యశ్వంత్ రావ్ చవాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గ్రౌండ్‌లో ముంబై షీల్డ్ అండర్-14 ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమ, మంగళవారాల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ టోర్నీలో యశ్వంత్ రావ్ చవన్ ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ గవాటే 1,045 పరుగులు చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ విషయాన్ని అతడి కోచ్ మనీష్ తెలిపాడు.

గవాటే ఇన్నింగ్స్‌లో 149 ఫోర్లు, 67 సిక్స్‌లు
60-65 గజాల లెగ్ సైడ్ బౌండ్రీ, 50 గజాల ఆఫ్ సైడ్ బౌండ్రీ హద్దులున్న గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగిందని చెప్పాడు. తనిష్క్ గవాటే ఇన్నింగ్స్‌లో 149 ఫోర్లు, 67 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ఈ టోర్నీకి నవీ ముంబై షీల్డ్ అండర్-14 అని పేరు పెట్టినప్పటికీ, ఎమ్‌సీఎ గుర్తింపు లేని టోర్నీ కావడందో అతను సాధించిన ఈ రికార్డుకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ సంఘం అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగుతానని అడిగాడు: కోచ్
‘ఎప్పుడూ మొదటి, రెండో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తనిష్క్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగుతానని కోరాడు. నెట్స్‌లో అతని ప్రాక్టీస్‌ను పరీక్షించి నమ్మకంతో ఈ మ్యాచ్‌కు ఓపెనర్‌గా వచ్చేందుకు ఒప్పుకున్నా. చాలా బాగా ఆడాడు' అని మ్యాచ్ అనంతరం తనిష్క్ కోచ్ మనీష్ చెప్పారు. టోర్నీలో లెదర్ బాల్ ఉపయోగిస్తున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











