సాధారణంగా వన్డే మ్యాచ్‌లో జట్టంతా కలిసి 350+ స్కోరు సాధిస్తే అదో పెద్ద గొప్ప. మరి అలాంటిది ఒక్కరే మూడు అంకెల స్కోర్ సాధిస్తే విశేషమే కదా. తాజాగా టీమిండియా యువ మహిళా బ్యాటర్ ఇరా జాదవే దాన్నే సాధించింది. ఏకంగా ట్రిపుల్ శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. తద్వారా అండర్ - 19 స్థాయిలో ఉన్నప్పుడే.. ఈ ఘనత సాధించిన తొలి మహిళా భారత క్రికెటర్‌గా నిలిచింది.
ఈ మార్క్ ను తాజాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో సాధించింది 14 ఏళ్ల ఐరా. ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ అమ్మాయి.. 157 బంతుల్లోనే 346 పరుగులు చేసింది. ఇందులో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే రీసెంట్ గా జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో ఇరా జాదవ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆమెనే ఈ ట్రిపుల్ సెంచరీ ఘనతను సాధించి ఔరా అనిపించింది.

మ్యాచ్ సాగిందిలా
వన్డేల్లో రెండు జట్లు కలిసి చేసే స్కోరును.. తాజా మ్యాచ్ లో ముంబయి ఒక్కటే సాధించేసింది. ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ, కెప్టెన్ హుర్లే గాలా (116) సెంచరీ తోడవ్వడంతో ముంబయి ఈ నెంబర్ ను టచ్ చేయగలిగింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబయి 50 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 563 పరుగుల స్కోర్ చేసింది.
ఎలినా ముల్లా (8)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇరా.. హుర్లేతో కలిసి రెండో వికెట్‌కు 274 పరుగులు జోడించింది. శతకం తర్వాత హుర్లే ఔటైతే.. దీక్ష పవార్ (39)తో కలిసి మూడో వికెట్‌కు 186 పరుగులు నమోదు చేసింది. దీక్ష ఔట్ అయిన తర్వాత మితాలీ హర్షద్ (26*) తో కలిసి నాలుగో వికెట్ పడకుండా స్కోరును 563 పరుగులకు తీసుకెళ్లింది. పైగా నాలుగో వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 64 పరుగుల పార్ట్నర్ షిప్ నిర్మించడం విశేషం.
19 పరుగులకే ఆలౌట్
ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మేఘాలయ ఛేదించలేకపోయింది. మరీ దారుణంగా 19 పరుగులకే ఆలౌటైంది. దీంతో మేఘాలయపై 544 పరుగుల భారీ తేడాతో ముంబయి జట్టు విజయం సాధించింది. ముంబయి బౌలర్లలో జీయా 3, యయాతి 3, రితికా 2, అక్షయ 2 వికెట్లు దక్కించుకున్నారు.