ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టులో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్‌లోకి వచ్చిన ఆ యువకుడు నేరుగా రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కాడు.అనంతరం హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అప్రమత్తమైన ఉప్పల్ మైదాన సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. గురువారం తొలి రోజు ఆటలో భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే భారీ సెక్యూరిటీని ఛేదించుకుని గ్రౌండ్‌లోకి వెళ్లిన ఆ అభిమానిపై పోలీసులు సీరియస్ అయ్యారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆ యువకుడికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, అతడు ఖమ్మం జిల్లాలోని అశ్వరారావు పేట మండలం రామ చంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా పోలీసులు తెలిపారు. అతడి వయసు 20 సంవత్సరాలు.

అయితే హర్షిత్ రెడ్డి కోహ్లి వీరాభిమానిగా తెలుస్తోంది. రోహిత్ శర్మ పాదాలను తాకే సమయంలో అతడు కోహ్లి జెర్సీని ధరించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే. తొలి టెస్టులో ఇంగ్లాండ్ తిరిగి పోటీలోకి వచ్చింది. మూడో రోజు ఆటలో పైచేయి సాధించి భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఒల్లీ పోప్ (148*; 208) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కోరల్లో నుంచి ఇంగ్లాండ్‌ను కాపాడి భారత్ విజయానికి అడ్డంగా నిలబడ్డాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సంపాదించిది.