భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. టీ20 ప్రపంచకప్‌కు 12 ఏళ్లు!!

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచి సరిగ్గా ఈ రోజుకు 12 ఏళ్లు. 12 ఏళ్ల క్రితం అంటే.. 2007 సెప్టెంబర్ 24న భారత్ మొదటిసారి జరిగిన టీ20 ఫైనల్ పోరులో దాయాది పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 1983లో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ నేతృత్వంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత భారత్‌కు మరో ప్రపంచకప్ రావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది.

నేటికి 12 ఏళ్లు:
పొట్టి ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుని నేటికి సరిగ్గా 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ అభిమానులు ఆనాటి విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బీసీసీఐ కూడా ఈ ప్రత్యేక విజయాన్ని గుర్తుచేస్తూ.. శ్రీశాంత్ క్యాచ్ పట్టిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. '2007లో ఈ రోజున టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది' అని కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోకు లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు:
అప్పటికి భారత్ మిగతా జట్లతో పోల్చితే తక్కువ టీ20లు ఆడడంతో.. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్ ఏమీ కాదు. మరోవైపు సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ.. ధోనీ టీమిండియాను ముందుండి నడిపించాడు. మొత్తం కుర్రాళ్లతో నిండిన జట్టుతో ధోనీ ప్రయోగాలు చేసాడు. ఇర్ఫాన్ పఠాన్, జోగిందర్ శర్మ, ఆర్పీ సింగ్, శ్రీశాంత్ వంటి బౌలర్లు రాణించడంతో సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్‌కు చేరింది.

గంభీర్ టాప్ స్కోరర్:
ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉతప్ప (8), యువరాజ్ (14), ధోనీ (6) విఫలమయినా.. ఇన్నింగ్స్ చివరలో రోహిత్ శర్మ (30) ధాటిగా ఆడాడు. పాక్ పేసర్ ఉమర్ గిల్ మూడు వికెట్లు తీసాడు.

శ్రీశాంత్ 'మ్యాచ్ స్టార్':
లక్ష్య ఛేదనకు దిగిన పాక్ తడబడుతూ విజయానికి చేరువగా వచ్చింది. ఇక చివరి ఓవర్‌లో పాక్ 13 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చేతిలో ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసింది. జోగిందర్ సింగ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని మిస్బా ఉల్ హక్ సిక్స్‌గా మలచడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఆ తర్వాతి బంతిని మిస్బా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. ఊహించని రీతిలో శ్రీశాంత్ బంతిని ఒడిసిపట్టుకోవడంతో భారత్ విజేతగా నిలిచింది. ధోనీ తన షర్ట్ విప్పి ఓ కుర్రాడికి బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు శ్రీశాంత్ 'మ్యాచ్ స్టార్' అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications