

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు గుర్తుకురాగానే అభిమానుల మదిలో మెదిలే ఇన్నింగ్స్ ఒక్కటే. అదే.. టీ20 క్రికెట్ మజాని అభిమానులకి రుచి చూపిస్తూ.. తొలి టీ20 ప్రపంచకప్‌లో యువీ బాదిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఇన్నింగ్స్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు.
ప్రస్తుతం యువరాజ్ సింగ్ జట్టులో స్థానం కోల్పోయినా.. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బుధవారం ఆరు సిక్సర్ల వీడియోని షేర్ చేస్తూ యువీని గుర్తు చేసుకుంటున్నారు. 2007, సెప్టెంబరు 19న.. తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్ వేదికగా యువీ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది.
అప్పటికే ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి, హెర్ష్‌లీ గిబ్స్‌లు ఈ ఘనతను అందుకున్నా.. అంతగా ఆదరణ పొందలేదు. రవిశాస్త్రి దేశవాళి క్రికెట్‌లో ఈ ఘనత సాధించగా.. గిబ్స్ చిన్నదేశంపై అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. కానీ యువరాజ్ సింగ్ క్రికెట్ పుట్టిన దేశం ఇంగ్లండ్‌పైనే ఈ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో యువీ కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఫ్లింటాప్ కావాలనే మైదానంలో యువరాజ్‌తో గొడవకి దిగాడు. దీంతో చిర్రెత్తిపోయిన యువరాజ్ తర్వాత బౌలింగ్‌కి వచ్చిన బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలోనే టీ20 చరిత్రలో 12 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లో మొత్తం నలుగురు ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టగా.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా యువరాజ్ సింగ్ చిరస్థాయిగా రికార్డుల్లో నిలిచాడు.