
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కాగా లీగ్ ప్రారంభానికి ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో భారత ఆటగాళ్లందరికీ 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫిట్ నెస్ క్యాంపులో ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో లేని భారత ఆటగాళ్లతోపాటు బీసీసీ కాంట్రాక్టు ఉన్న, కాంట్రాక్టు లేని ఆటగాళ్లు పాల్గొననున్నారు.
ఈ ప్రత్యేక క్యాంపులో భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, యజుర్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ తదితరులు పాల్గొననున్నారు. ఇక ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న ఆటగాళ్లంతా లీగ్ మ్యాచ్‌లో అయిపోగానే ఎన్సీఏలో చేరుతారని బీసీసీఐ తెలిపింది. అంతేకాకుండా ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గాయం కారణంగా శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్ ఎన్సీఏలో కోలుకున్నాడని, ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది.
కాగా అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 26న మెగా లీగ్ మొదలై మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. పది జట్లతో కూడిన ఐపీఎల్‌లో ఈ సారి లీగ్ స్టేజ్‌లోనే 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితోపాటు 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ సారీ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని 4 స్టేడియాల్లోనే జరగనున్నాయనే సంగతి తెలిసిందే.