హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది. 2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది.
2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్ గోస్వామి మాత్రమే సభ్యులు.

ఫైనల్ మ్యాచ్ జరిగే లార్డ్స్ మైదానం గురించి మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి. 1983లో ఇదే స్టేడియం ఓ చరిత్రకు వేదిక అయింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించింది. అప్పుడు పురుషుల జట్టును ఈ స్టేడియం హీరోలని చేస్తే... ఇప్పుడు మహిళల జట్టును మిథాలీసేనను ఏం చేస్తోందో చూడాలి మరి.
ఇంగ్లాండ్ Vs ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విశేషాలు:
* కెప్టెన్ హోదాలో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది.
* 2005లో తొలిసారి ఫైనల్ చేరిన భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ, ఇంగ్లండ్ మాత్రం 3 సార్లు (1973, 1993, 2009) విజేతగా గెలిచింది.
* భారత్‌కిది రెండో ప్రపంచకప్ ఫైనల్. ఇంతకుముందు 2005 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఇంగ్లాండ్‌కిది ఏడో ఫైనల్.
* ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు ప్లేయర్లు ఈ టోర్నీలో 350 కంటే ఎక్కువ పరుగులు చేశారు. టామీ బ్యూమాంట్ (387), హెదర్ నైట్ (363), సారా టేలర్ (351) ఆ జాబితాలో ఉన్నారు.
* భారత స్పిన్నర్ దీప్తి శర్మ టోర్నీలో తీసిన వికెట్లు మొత్తం 12. ఫైనల్ ఆడబోతున్న ఇరు జట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దీప్తి శర్మే.
* ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన పరుగులు 171. టోర్నీలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
* ఈ వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ పరుగులు 391. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలీస్ పెర్రీ (404) అగ్రస్ధానంలో ఉంది.
* న్యూజిలాండ్‌పై లీగ్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ రాజేశ్వర్ గైక్వాడ్ చేసిన 5/15 ప్రదర్శన టోర్నీలో అత్యుత్తమ గణాంకాల్లో ఒకటి.
* వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో ముఖాముఖీ ఆడిన పది మ్యాచ్ ల్లో భారత్ నాలుగింట్లో నెగ్గింది. ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచింది.
* భారత్ ఫైనల్లో గెలిస్తే వరల్డ్ నెగ్గిన నాలుగో జట్టుగా నిలుస్తుంది. 1973లో ఆరంభమై పదిసార్లు జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా (6), ఇంగ్లండ్ (3), న్యూజిలాండ్ (1) మాత్రమే గెలిచాయి.
* లార్డ్స్‌లో భారత్-ఇంగ్లండ్ మూడు సార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్‌లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2012లో చివరిసారి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించింది.