జకర్తా/లండన్: ఇండోనేషియాలో పపువా రాష్ట్రంలో ఆదివారం రాత్రి అర్ధరాత్రి ఓ స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో పదిహేడు మంది మృతి చెందారు. అందులో పన్నెండు మంది మహిళలు ఉన్నారు. నలభై మందికి పైగా గాయపడ్డారు. నబిరే పట్టణంలో కోటాలామా స్పోర్ట్స్ స్టేడియంలో బాక్సింగ్ పోటీలో స్థానిక బాక్సర్ ఓడిపోయాడు.
దీంతో అతని మద్దతుదారులు న్యాయ నిర్ణేతలపై కుర్చీలు విసిరి, గెలుపొందిన బాక్సర్ మద్దతుదారులతో గొడవకు దిగారు. గెలిచిన ఆటగాడి మద్దతుదారులు కూడా సీసాలు, కుర్చీలతో ఎదురుదాడి చేశారు. దీంతో స్టేడియంలోని పదిహేను వందల మందికి పైగా ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. బయటకు వెళ్లేందుకు కేవలం రెండు మార్గాలే ఉండటంతో తొక్కిసలాట జరిగింది.

ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ మహిళ మృతి
విరాళాల సేకరణ కోసం ఓ బ్రిటన్ మహిళ చేపట్టిన సాహస కృత్యం విషాదాంతమైంది. 34 ఏళ్ల సుసాన్ టేలర్ ఇంగ్లీష్ ఛానల్ ఈదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సుసాన్ ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదుతుండగా, అకస్మాత్తుగా అశక్తురాలయ్యారని, వెంటనే ఆమెను పడవలోకి చేర్చి చికిత్స అందించామని, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని సుసాన్ సోదరి ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు.
డయాబెటిస్ యూకె, రెయిన్ బోస్ చిల్డ్రన్స్ హాస్పైస్ కోసం విరాళాలు సేకరించేందుకు సుసాన్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆమె మరణ వార్త బయటకు రాగానే సుసాన్ ఛారిటీ పేజీపై రెట్టింపు ప్రతిస్పందన వచ్చింది. కాగా ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ 1875 నుండి ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు.