స్వర్ణం సాధించే వరకు విశ్రమించను: మేరీకోమ్

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే వరకు విశ్రమించనని భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్ పేర్కొంది. విజయానికి ఎలాంటి మంత్రం లేదని.. కష్టపడితేనే ఫలితం వస్తుందని మేరీ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇల్లు, హాస్టల్ గదులకే పరిమితమైన అథ్లెట్ల కోసం భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ కార్యక్రమంలో 'మేకింగ్ ఆఫ్ ఎ ఛాంపియన్' అంశంపై మేరీకోమ్ మాట్లాడింది.
'టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడ్డ నేపథ్యంలో.. దొరికిన ఈ సమయాన్ని అనుకూలంగా మలుచుకుంటా. దేశానికి ఒలింపిక్ స్వర్ణం అందించడమే నా లక్ష్యం. విజయానికి నా దగ్గర ఎలాంటి మంత్రాలు లేవు. బాగా కష్టపడండి. చేస్తున్న పని పట్ల నిజాయతీగా ఉండండి.. అంతే' అని మేరీకోమ్ తెలిపింది. కష్టపడటం తప్ప విజయానికి మరో సూత్రం లేదని.. తాను చిన్నప్పటి నుంచి ఇదే పాటిస్తున్నానని పేర్కొంది.
'క్రీడాకారుల కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రత కోల్పోవద్దు. కెరీర్ ఆరంభంలో చాలా కష్టపడ్డా. పేద కుటుంబం కావడంతో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఆ కష్టాల్ని ఇప్పుడు చెప్పలేను. వాటిని గుర్తుంచుకోవడం కూడా ఇష్టం లేదు' అని మేరీకోమ్ చెప్పింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మేరీకోమ్.. గత విశ్వక్రీడలు (2016 రియో ఒలింపిక్స్) అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల జోర్డాన్‌లోని అమన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో పాల్గొన్న మేరీకోమ్.. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి కాబట్టి మేరీకోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే మార్చి 18న రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయి విమర్శలు ఎదుర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications