ఫానెక్స్: బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త యావత్ క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 74 ఏళ్ల వయసులో శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచిన 'ది గ్రేటెస్ట్' మహ్మద్ అలీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న మహ్మద్ అలీ తన వ్యక్తిత్వంతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేసుకున్నారు.
కానీ అలీ దీనిని తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడలేనని తేల్చి చెప్పారు. ప్రపంచ బాక్సింగ్‌లో రికార్డు స్థాయిలో 56 విజయాలు నమోదు చేసి, కేవలం ఐదు పరాజయాలతో తన బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన అలీ అంటే పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టం. అందుకు ఉదాహరణ ఈ వీడియో.
ప్రపంచ బాక్సింగ్‌లో మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను సాధించిన మహ్మద్ అలీని ఓ పిల్లాడు బాక్సింగ్ రింగ్‌లో మట్టికరింపించాడు. అంతేకాదు పిల్లాడి పంచ్‌లు తట్టుకోలేక అలీ చేతులెత్తేశాడు. చివరకు మ్యాచ్ రిఫరీ వచ్చి ఆ చిన్నారి విజయం సాధించినట్టు ప్రకటించాడు.