
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ సరితా దేవికి కరోనా వైరస్ సోకింది. సరితాతో పాటు ఆమె భర్త తోబియా సింగ్‌కి కూడా కరోనా బారినపడ్డారు. అయితే సరితా దేవి కొడుకు తోమ్‌తిన్‌కి మాత్రం నెగటివ్‌గా వచ్చింది. సరితా దేవి, ఆమె భర్త తోబియాకి ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడం విశేషం. ప్రస్తుతం సరితా కుటుంబం ఇంపాల్‌లో ఉంది. తోబియా పీటీఐతో ఫోన్లో మాట్లాడి తమకు వైరస్ సోకిన విషయాన్ని తెలియజేశారు.
'తాజాగా నిర్వహించిన పరీక్షల్లో సరితా దేవితో పాటు నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. మేమిద్దరం హోం క్వారంటైన్ నుంచి కొవిడ్ కేంద్రానికి వెళుతున్నాం. మా ఇద్దరిలోనూ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ మాకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. మేము తొందరలోనే కోలుకుంటాం. మా కొడుకు తోమ్‌తిన్‌కి మాత్రం నెగటివ్ వచ్చింది. ఆ విషయంలో సంతోషంగా ఉన్నాం' అని తోబియా సింగ్ తెలిపారు.
'నాకు, నా భర్తకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేకున్నా కరోనా సోకింది. ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఇప్పుడు మేమిద్దరం కొవిడ్ కేంద్రానికి వెళుతున్నాం. గత వారం రోజులుగా మమ్మల్ని కలిసిన వారందరూ వెంటనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లాలని కోరుతున్నా' అని బాక్సర్ సరితా దేవి సూచించారు. జాతీయ బాక్సింగ్ శిక్షణ శిబిరం పాటియాలాలో నడుస్తున్నా.. కరోనా వైరస్ కారణంగా సరితా దేవి తన స్వస్థలమైన మణిపూర్‌లోనే ఉండిపోయారు. మరోవైపు సైక్లిస్ట్ త్రియాషా పాల్ కరోనా బారిన పడ్డారు.
ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన సరితా దేవి.. ఐదు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 2006లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల బాక్సర్ సరితా ఆ తర్వాత కూడా రెండు సార్లు కాంస్య పతకాలు గెలుపొందారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ రజత పతకం సాధించిన సరితా .. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్ క్యాలిఫయింగ్ ఈవెంట్ ట్రయిల్స్‌లో మాత్రం నిరాశపరిచారు.