టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏడాదికి ఏడాది బుమ్రా మరింత మెరుగవ్వుతున్నాడని కొనియాడాడు. అతని గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లను అడిగితే సరిపోతుందని అన్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో మల్టీ ఫార్మాట్ అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కితాబిచ్చాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు తిరిగి అందుబాటులో రానున్నాడు. టీ20 కప్ విజేతగా భారత్ నిలవడంలో బుమ్రాది కీలకపాత్ర. ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతి సందర్భంలో బుమ్రా రంగంలోకి దిగి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఎంతో విలువైన బుమ్రా.. పనిభారంగా గాయాలపాలవ్వకుండా బీసీసీఐ ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా విశ్రాంతి ఇస్తుంది.

అయితే గాయాల తర్వాత గత పునరాగమనంలో బుమ్రా మరింత మెరుగ్గా వచ్చిన సందర్భాలను పాంటింగ్ గుర్తు చేశాడు. ఇతర ఆటగాళ్ల విషయాల్లో తమ లయను తిరిగి అందుకుంటారా అనే సందేహాలు ఉంటాయని, కానీ బుమ్రా విషయంలో ఉండవని తెలిపాడు. ''గత కొన్నేళ్లలో గాయాల గురించి భయాలు ఉండేవి. రీఎంట్రీలో పూర్వపు లయను అందుకుంటాడా లేదా? అని. కానీ బుమ్రా కమ్‌బ్యాక్ గొప్పగా ఉంది. గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. గత అయిదు ఆరేళ్లుగా ప్రపంచ అత్యుత్తమ మల్టీ ఫార్మాట్ బౌలర్ బుమ్రానే''
''టీ20 వరల్డ్ కప్‌లో అతనే ఏం సాధించాడో చూశాం. పేస్, నైపుణ్యం అలానే ఉంది. కచ్చితత్వంలోనూ ఎలాంటి మార్పు లేదు. ఏడాదికి ఏడాది మరింత మెరుగువుతున్నాడు. బుమ్రాలా నైపుణ్యల, నిలకడ ఉంటే మీరు కూడా అత్యుత్తమ ప్లేయర్లు అవుతారు. బుమ్రా గురించి తెలుసుకోవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లను అడిగితే సరిపోతుంది. 'బుమ్రా ఓ పీడకల. ఎలాంటి బంతులు సంధిస్తాడో చెప్పలేం' అంటుంటారు. స్వింగ్, పేస్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్‌తో గొప్పగా బంతులు వేస్తాడు.గ్లెన్ మెక్‌గ్రాత్, జేమ్స్ అండర్సన్‌లా చరిత్రలో బుమ్రా మిగిలిపోతాడు'' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.