న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో బాక్సర్ సరితాదేవి ఎదుర్కొన్న పరిస్దితిని తాను బాగా అర్దం చేసుకున్నానని బంగారు పతక విజేత బాక్సర్ మేరీ కోమ్ అన్నారు.
సరితాదేవి భావోద్వేగాలను తాను పూర్తిగా అర్దం చేసుకున్నాను కాబట్టే తనకు మద్దతు తెలిపానని అన్నారు. ఐతే తానే అలాంటి పరిస్దితిలో ఉంటే మరోలా నిరసన తెలిపేదాన్ని అని మేరీకోమ్ పేర్కొన్నారు.
దక్షిణ కొరియాకు చెందిన పార్క్ జీ నా చేతిలో మంగళవారంనాడు లైట్‌వెయిట్ సెమీ ఫైనల్లో సరిత ఓడిపోయింది. దీంతో సరిత తీవ్ర ఆగ్రహానికి గురైంది. జడ్జిల నిర్ణయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మర్నాడు తనకు ప్రదానం చేసిన కాంస్య పతకాన్ని ధరించడానికి సరిత నిరాకరించింది.

దాన్ని చేతిలో పట్టుకుని పార్క్‌కు ఇవ్వడానికి సరిత ప్రయత్నించింది. నిర్వాహకులు చెప్పినా ఆమె వినలేదు. తాను బాగా చేశానని సరిత అనుకున్నదని, కానీ మిగతా క్రీడాకారుల ఆనందాన్ని ఆమె చంపేసిందని, ఆమె క్షమాపణ చెప్పినందుకు సంతోషంగా ఉందని, ఇటువంటి సంఘటన మళ్లీ జరగకూడదని ఒసిఎ అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఆల్ ఫహద్ ఆల్ - సబా అన్నారు. క్రీడాకారిణిగా రెఫరీల నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు.
సరితాదేవి చేసిన తప్పుకు గట్టి హెచ్చరిక చేసి సరితా దేవిని వదిలేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఒసిఎ గౌరవ లైప్ వైస్ ప్రెసిడెంట్ వీ జిజోంగా శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. సంఘటనతో భారత ప్రతినిధి బృందానికి ఏ విధమైన సంబంధం లేదని, అది క్రీడాకారిణి వ్యక్తిగత దుష్ప్రవర్తన మాత్రమేనని అన్నారు.