
హైదరాబాద్: రాబోయే బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆరు సార్లు ఈ టోర్నీ విజేతగా నిలిచిన మేరీ కోమ్, లలీనా బొర్గోహైన్‌లకు చోటు దక్కింది. అయితే, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ట్రయల్స్ లేకుండా జట్టు ఎంపికను మాజీ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ విమర్శించింది.
ఏ మేజర్ టోర్నీకైనా అర్హత పోటీలు నిర్వహించిన తర్వాతే ఎంపిక జరుగుతుందని... అయితే, నిబంధనలకు విరుద్ధంగా బాక్సింగ్ సమాఖ్య వ్యవహరించిందని నిఖత్ జరీన్ ఆరోపించింది. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడం సరైన విధానం కాదని సమాఖ్యకు రాసిన ఒక లేఖలో పేర్కొంది.
వెంటనే ట్రయల్స్ నిర్వహించాలని కూడా నిఖత్ జరీన్ అందులో బాక్సింగ్ సమాఖ్యను కోరింది. కాగా, ఇటీవలి కాలంలో మేరీ కోమ్, లలీనా అద్భుతంగా రాణించారని, అందుకే వారిని ఎంపిక చేశామని భారత బాక్సింగ్ సమాఖ్య వివరించింది. 36 ఏళ్ల మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో ఈ ఏడాది రెండు స్వర్ణ పతకాలు(ఇండియా ఓపెన్, ఇండోనేషియా టోర్నమెంట్) గెలిచిన సంగతి తెలిసిందే.
ఇక లలీనా బొర్గోహైన్ విషయానికి వస్తే 69 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. ఇక, 23 ఏళ్ల నిఖత్ జరీన్ ఇటీవలే ముగిసిన థాయిలాండ్ ఓపెన్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే మేరీ కోమ్ ఇటీవలే సమాఖ్య అధికారులను కలిసిన ఆ తర్వాతే ఆమె పేరు ఈ జాబితాలో ఉండటంతో జరీన్ ఆరోపణలకు కారణమైంది.