
హైదరాబాద్: బల్గేరియా వేదికగా జరుగుతోన్న 69వ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీల్లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 కిలోల విభాగం సెమీఫైనల్లో మేరీ కోమ్ చైనాకు చెందిన యీ జియ్‌లి (చైనా)ని చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మేరీ కోమ్‌కి ఇది వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ కావడం విశేషం.
మరోవైపు సరితా దేవి (60 కిలోలు), మీనా కుమారి (54 కిలోలు) విభాగాల్లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. సెమీస్‌లో పొకెనెన్ (ఫిన్లాండ్) చేతిలో సరిత ఓటమి పాలవగా, మరో సెమీస్‌లో మీనా.. పెట్రోవా (బల్గేరియా) చేతిలో పరాజయం పాలైంది. ఇక పురుషుల విభాగంలో వికాస్ కృష్ణన్ (75 కిలోలు), గౌరవ్ సోలంకి (52 కిలోలు), సతీశ్‌కుమార్ (91 కిలోలు) సెమీస్‌లో అడుగుపెట్టారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా జరిగిన బౌట్లలో కిర్గిస్థాన్‌కు చెందిన అజత్ ఉసెనాలెవ్‌పై గౌరవ్.. కజకిస్థాన్ బాక్సర్ తుర్నిసబే కులాఖ్‌మెత్‌పై వికాస్, ఇమాన్ (ఇరాన్)పై సతీశ్‌లు విజయం సాధించారు. ఈ టోర్నీలో ఇప్పటికే అమిత్ ఫంగాల్ (49 కిలోలు), మహ్మద్ హుస్సాముద్దీన్ (56 కిలోలు) కూడా తుది నాలుగు జాబితాలో చోటు సంపాదించారు.
దీంతో ఈ టోర్నీలో మొత్తంగా పది పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి.