
హైదరాబాద్: ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ పసిడి పంచ్ విసిరింది. గురువారం ముగిసిన మెగా టోర్నీలో మేరీ సహా మహిళా బాక్సర్లు ఐదు పసిడి పతకాలను సాధించారు. అయితే, పురుషుల విభాగంలో క్యూబా, ఉజ్బెకిస్థాన్ బాక్సర్లు పతకాలను సాధించడం విశేషం.
మహిళల 48 కేజీల ఫైనల్ బౌట్‌లో మేరీకోమ్ 4-1తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్)ని చిత్తుగా ఓడించింది. 64 కేజీల టైటిల్ పోరులో అస్సాం బాక్సర్ ప్వీలా బాసుమంత్రే 3-2తో సుడాపోర్న్ సీసోండి (థాయ్‌లాండ్)ని ఓడించి తొలి స్వర్ణాన్ని అందించింది. ఇక, ప్రపంచ మాజీ ఛాంపియన్ సరితా దేవి మాత్రం రజతంతో సరిపెట్టుకుంది.
60 కిలోల ఫైనల్లో చివరి వరకూ పోరాడిన ఆమె 2-3తో మిరా పెట్కోనన్ (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు 51 కేజీల విభాగంలో పింకీ జాంగ్రా.. ఏకపక్ష పోరులో జర్‌గ్లాన్ ఒచిర్‌బాట్ (మంగోలియా)పై, 54 కేజీల కేటగిరీలో మనీషా.. మీనాకుమారిపై గెలిచి స్వర్ణాలను సాధించారు.
69 కేజీల కేటగిరీలో లోవ్లీనా బోర్గోహెన్ (అస్సాం).. పూజపై గెలిచి స్వర్ణాన్ని సాధించింది. ఇక, పురుషుల 91 కిలోల విభాగంలో సంజీత్ స్వర్ణం సాధించాడు. 60 కేజీల బౌట్‌లో మనీష్ కౌశిక్ రింగ్‌లోకి దిగకుండానే పసిడి గెలిచాడు. గాయం కారణంగా బట్టుమర్ మిషిల్ట్ (మంగోలియన్) పోటీ నుంచి తప్పుకోవడంతో అతనికి వాకోవర్ లభించింది.
తెలుగు బాక్సర్ కాకర్ల శ్యామ్ కుమార్ (49 కేజీలు), ఆసియా క్రీడల కాంస్య విజేత సతీష్ కుమార్ (+91) రజతానికి పరిమితమయ్యారు. ఫైనల్లో భారత్‌కే చెందిన అమిత్ 4-1 స్కోరు తేడాతో శ్యామ్‌ను ఓడించి స్వర్ణ పతకం అందుకున్నాడు. 81 కేజీల కేటగిరీలో దేవాన్ష్ జైస్వాల్ 1-4తో డేవిడ్ గుటిరెజ్ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు.
మరోవైపు 75 కేజీల్లో స్వీటీ బూర.. ఎస్సాని క్లోటిల్డే (కామెరూన్) చేతిలో ఓటమిపాలై రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో స్వర్ణ పతక విజేతకు లక్షా 60 వేలు, రజతానికి 96 వేలు, కాంస్యానికి 32 వేల నగదు లభించింది.