
బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కే1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విషాదకరంగా ముగిసింది. బౌట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కిక్‌బాక్సర్ నిఖిల్ సురేష్ కన్నుమూశాడు. ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు అతను గాయపడ్డాడు. ముఖంపై పంచ్ దెబ్బ గట్టిగా తగిలడంతో రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఇక లేవ లేదు. నిర్వాహకులు అతణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనలో కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిఖిల్ సురేష్.. మైసూరు నివాసి. వయస్సు 23 సంవత్సరాలు. సురేష్-విమల దంపతుల చిన్న కుమారుడు. బెంగళూరులోని కెంగేరీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కే1 కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ఈ నెల 10వ తేదీన కెంగేరీ జ్ఞాన జ్యోతినగర్‌లోని పాయ్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో ఈ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఏర్పాటైంది.
ఇందులో బౌట్‌లో తలపడే సమయంలో ప్రత్యర్థి అతని ముఖంపై గట్టిగా పంచ్ విసిరాడు. దీనితో రింగ్‌లోనే కుప్పకూలాడు. అనంతరం అతణ్ని నాగరభావిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తన కుమారుడు ఇక లోకాన్ని వీడి వెళ్లాడని సురేష్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కిక్ బాక్సర్‌గా ఎదగాలనే ఆశలతో బెంగళూరు ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడని ఆవేదన వ్యక్తం చేశారు.
నిఖిల్ సురేష్ కోచ్ కూడా ఈ మరణవార్తను ధృవీకరించారు. బౌట్‌లో గాయపడ్డ వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సకాలంలో అంబులెన్స్‌లో అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ప్రమాదకరమైన కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసిన సమయంలో శిక్షణ పొందిన మెడికల్ స్టాఫ్, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారని చెప్పారు. మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదమోనని అన్నారు.