
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు మరో షాక్ తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్ బౌట్‌లో పూజా రాణి ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో 5-0 తేడాతో పూజా మ్యాచ్‌ను చేజార్చుకుంది. చైనా బాక్సర్ లీ.. మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్‌లతో పూజాను కోలుకోకుండా చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్ వైపే మొగ్గు చూపారు. పూజా రాణి మరీ పేలవమైన ఆటను ఆడింది. ఎక్కడా అటాక్ చేసినట్లు కనిపించలేదు. దీంతో ఆమె మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఓటమి భారత్‌కు నిరాశనే మిగ్చిలింది.
అంతకుముందు ఇండియాకు బాక్సింగ్‌లో కచ్చితంగా మెడల్ తీసుకొస్తాడనుకున్న స్టార్ బాక్సర్, ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కొలంబియా బాక్సర్ మార్టినెజ్ రివాస్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్‌లో1-4 తేడాతో అమిత్ పరాజయం పాలయ్యాడు. 48-52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అమిత్.. ఈసారి మెడల్ హాట్ ఫేవరెట్‌లలో ఒకడిగా ఉన్నాడు. కానీ కనీసం క్వార్టర్స్‌కు చేరుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించేదే.
అమిత్ పంఘాల్ తొలి రౌండ్‌లోనే ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో రౌండ్‌లో మార్టినెజ్ రివాస్ పూర్తి ఆధిపత్యం చెలాయించి భారత బాక్సర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పర్ కట్స్‌తో ఎదురుదాడి చేసి అమిత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో మరింత దూకుడుగా పంచులు కురిపించిన అతడు అమిత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో భారత బాక్సర్ డిఫెన్స్ చేసుకోడానికే ప్రయత్నించాడు. అమిత్ ఓటమిపాలైనా ఇటీవల భారత్ తరఫున బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బాక్సర్‌గా కొనసాగుతున్నాడు. 2018 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన అతడు తర్వాతి ఏడాది 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుపొందాడు. 2017 తర్వాత అతడిలా పెద్ద ఈవెంట్లలో ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి.
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటలకు సింధు కాంస్యం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో తలపడనుంది. ఈ మ్యాచులో సింధు గెలిస్తే.. భారత్ ఖాతాలో రెండో మెడల్ చేరనుంది.