తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత్ బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి చెప్పిన వ్యాఖ్యలను.. మీడియా భిన్నంగా తీసుకుందని మేరీకోమ్ పేర్కొన్నారు.
''నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆ కార్యక్రమంలో తప్పుగా చెప్పాను. ఆటకు వీడ్కోలు పలకాలని భావిస్తే మీడియా ముందుకు నేరుగా వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తాను. బాక్సింగ్‌కు గుడ్ బై పలికినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది నిజం కాదు! డిబ్రూఘర్‌లోని ఓ స్కూల్ ఈవెంట్‌కు బుధవారం హాజరయ్యాను''

''పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. 'బాక్సింగ్‌లో మరిన్ని ఘనతలు సాధించాలనే కోరిక ఇప్పటికీ ఉంది. ఒలింపిక్స్‌లో వయోపరిమితి నిబంధనతో పాల్గొనే అవకాశం నాకు లేదు. కానీ ఆటను కొనసాగించాలనుకుంటున్నా. ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నా' అని చెప్పాను. అయితే ఆటకు వీడ్కోలు పలికే సమయం వస్తే ప్రతిఒక్కరికి ఆ విషయాన్ని తెలియజేస్తాను'' అని మేరీ కోమ్ వివరించారు.
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ప్రస్తుత వయస్సు 41 ఏళ్లు. అయితే ఎలైట్ లెవల్‌లో బరిలోకి దిగాలంటే గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు మాత్రమే.కాగా, మేరీకోమ్ తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించింది. భారత్ బాక్సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రికార్డులు అందుకుంది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొన్న తొలి పోరులోనే ఫైనల్ వరకు చేరి అందరి దృష్టి తనవైపునకు తిప్పుకుంది. 18 ఏళ్ల వయస్సులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో మేరీకోమ్ అంతర్జాతీయ పోటీలో అరంగేట్రం చేసింది.
మేరీకోమ్ అయిదుసార్లు ఏషియన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సాధించిన భారత తొలి మహిళా బాక్సర్‌గా మేరీకోమ్ రికార్డు నెలకొల్పింది. 2005, 2006, 2008, 2010, 2018లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2022లో కామన్‌వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్ సమయంలో మేరీకోమ్ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత నుంచి ఆటకు దూరంగా ఉంది. మణిపుర్‌కు చెందిన మేరీకోమ్‌కు ముగ్గురు పిల్లలు. క్రీడారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తుగా 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యింది. 2020 పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుంది.