
హైదరాబాద్: హెవీవెయిట్ బౌట్ నెగ్గిన అనంతరం బాక్సర్ మృతి చెందిన సంఘటన ఇంగ్లాండ్‌లోని డానక్యాస్టర్ పట్టణంలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన బాక్సింగ్ పోరులో బ్రిటిష్ బాక్సర్ స్కాట్ వెస్ట్‌గార్త్ తన ప్రత్యర్ధి డెక్ స్పెల్మెన్‌పై విజయం సాధించాడు.
అనంతరం స్థానిక మీడియా ఛానెల్‌కు ఇంటర్యూ ఇస్తున్న సమయంలో 31 ఏళ్ల స్కాట్ వెస్ట్‌గార్త్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని రాయల్ హల్లాంషైర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందూతూ మరణించాడు. ఈ విషయాన్ని బాక్సింగ్‌లో వెస్ట్‌గార్త్‌ని ప్రమోట్ చేస్తోన్న స్టెఫీ బుల్ పేర్కొన్నాడు.
'స్కాట్ వెస్ట్‌గార్త్‌ని దేవుడు ఆశీర్వదించాలి. బాక్సింగ్ క్రీడను ప్రమోట్ చేసే క్రమంలో తన జీవితాన్నే కోల్పోయాడు. నా వద్ద మాటల్లేవు' అని సోషల్ మీడియాలో తన ఫేస్‌బుక్ పేజీలో సోమవారం పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే స్కాట్ వెస్ట్‌గార్త్ చేతిలో ఓటమి పాలైన స్పెల్మెన్ మాట్లాడుతూ 'నా గుండె ఒక్కసారిగా బద్దలైంది. అతడి కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నాడు.