
టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో భారత్ దూసుకెళ్తోంది. మూడోరోజు మిశ్రమ ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను చవి చూసినప్పటికీ.. రోజు గడుస్తున్న కొద్దీ కొన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తూ వచ్చింది. మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో పీవీ సింధు అద్భుతంగా రాణించింది. వార్ వన్ సైడ్ చేసింది. డబుల్స్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా ఆడలేకపోయినప్పటికీ.. మిగిలిన విభాగాల్లో భారత్ ముందడుగు వేసింది. టేబుల్ టెన్నిస్‌లో మణిక బాత్రా మూడో రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
అలాగే- పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ సెమీఫైనల్‌లో భారత రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇన్ని శుభ పరిణామాల మధ్య భారత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్.. తన తడాఖా చూపారు. తొలి రౌండ్‌లో అలవోకగా విజయాన్ని సాధించారు. 39 సంవత్సరాల వయస్సులో..ముగ్గురు పిల్లల తల్లి మేరీ కోమ్ తన వయస్సులో సగం వరకు ఉన్న ప్రత్యర్థిని మట్టి కరిపించారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మిగ్వెలినా హెర్నాండెజ్ గార్సియాపై విజయం సాధించారు. కొకుగికన్ ఎరీనాలో సాగిన మ్యాచ్‌ను 4-1 తేడాతో గెలుచుకున్నారు.
మహిళల 51వ కేజీల ఫ్లైవెయిట్ ప్రిలిమ్స్ రౌండ్ ఆఫ్ 32లో మేరీ పోటీ చేశారు. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి మేరీకోమ్-హెర్నాండెజ్ సమవుజ్జీలుగా కనిపించారు. 19-19 పాయింట్లను సాధించారు. మూడో రౌండ్‌లో మేరీకోమ్ తన బౌట్లతో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థికి చుక్కలు చూపారు. 16వ రౌండ్‌లో అడుగు పెట్టారు. ఈ బౌట్ గెలవడానికి మేరీకోమ్ పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. అలవోకగా నెగ్గారు. రింగ్‌లో పాదరసంలా కదిలారు. ప్రత్యర్థి విసిరే పంచ్‌ల నుంచి తప్పించుకుంటూనే.. ముష్టిఘాతాలను కురిపించారు. పిడుగుల్లాంటి బౌట్లతో మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో మేరీకోమ్ 16వ రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
మేరీ కోమ్ విజయం సాధించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ముగ్గురు పిల్లల తల్లి దెబ్బ ఎలా ఉందో ప్రత్యర్థి రుచి చూశారని కితాబిస్తోన్నారు. భారత్ పతకాన్ని ఆశించే కేటగిరీ ఇది. అలాగే- మేరీ కోమ్ చివరి ఒలింపిక్స్ కూడా ఇదే కావడంతో ఈ విభాగంపై అనేక అంచనాలు, ఆశలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మేరీ కోమ్ విజృంభించడం శుభ సంకేతాలను పంపించినట్టయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తోన్నారు. ఇదే దూకుడు కొనసాగితే- ఈ విభాగంలో మెడల్ ఖాయమని జోస్యం చెబుతున్నారు. మున్ముందు మరిన్ని కఠిన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ.. మేరీ కోమ్ అనుభవం ముందు వారంతా దిగదుడుపేనని అంటున్నారు.