
హైదరాబాద్: స్వప్న బర్మన్... ఈ పేరు ఆసియా గేమ్స్ ముందు వరకు పెద్దగా పరిచయం లేదు. అయితే, ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్‌లో 21 ఏళ్ల బెంగాల్ అథ్లెట్ స్వప్న బర్మన్ స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఆసియా గేమ్స్ చరిత్రలోనే తొలిసారి హెప్టాథ్లాన్‌లో స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా స్వప్న బర్మన్ చరిత్ర సృష్టించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
దీంతో స్వప్న బర్మన్ పేరు యావత్ దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. నిజానికి, ఎప్పుడో పశ్ఛిమ బెంగాల్‌లో పాఠ్యపుస్తకాల్లో మాత్రం స్వప్న బర్మన్ గురించి ఓ పాఠమే ఉంది. స్వప్న సాధించిన ఘనతలను ఓ పాఠ్యాంశంగా పొందుపరిచారు. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్‌కు హెప్టాథ్లాన్‌లో తొలి స్వర్ణ పతకం అందించిన అథ్లెట్‌గా స్వప్న చరిత్రను తిరగరాసింది.
రాజ్‌బోంగ్షీ తెగకు చెందిన దిగువ మధ్య తరగతి కంటే తక్కువస్థాయి నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఆసియా గేమ్స్‌లో స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. రెండు రోజులపాటు జరిగిన ఏడు క్రీడల్లో మొత్తం 6026 (కెరీర్ బెస్ట్) పాయింట్లతో హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
అయితే, పంటినొప్పితో బాధపడుతూనే ఒక్కో ఈవెంట్‌లో స్వప్న పోటీపడుతుండటాన్ని టీవీలో వీక్షించిన ఆమె తల్లి బసానా దేవి భావోద్వేగానికి గురైంది. కూతురికి స్వర్ణం ఖరారవ్వగానే ఉద్వేగం ఆపుకోలేకపోయింది. బోరున ఏడ్చేసింది. పక్కకు ఒరిగిపోయింది. తర్వాత లేచి ఏడుస్తూనే ఇంటి ప్రాంగణంలో తన కోసం కూతురు కట్టించిన కాళికా మాత ఆలయానికి వెళ్లింది.

సాష్టాంగపడి మొక్కింది. ఆ వీడియోను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు. ఆసియా క్రీడల్లో హెప్లాథ్లాన్ స్వర్ణం నెగ్గిన స్వప్న బర్మన్‌కు పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిన్ననాటి నుంచి సవాళ్లకు అలవాటు పడ్డ స్వప్న బర్మన్.. తనేంటో చూపించడానికి ఈ హెప్టాథ్లాన్ ఈవెంట్‌ను ఎంచుకుంది. పశ్చిమబంగాలోని జలపాయ్‌గురి పట్టణ సమీప ఘోసాపార అనే పల్లెటూరు ఆమె స్వస్థలం. తండ్రి పంచానన్ బర్మన్ రిక్షావాలా. తల్లి బసానా దేవి ఇంటింటా పనులు చేయడంతోపాటు తేయాకు తోటలో కూలీగా పని చేస్తోంది. వీరికి నలుగురు సంతానం.
ఏడేళ్ల కిందట తండ్రికి గుండెపోటు రావడంతో మంచానపడ్డాడు. కేవలం ఆటలోనే కాక వేరే సవాళ్లను కూడా చాలానే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా స్వప్న ఆర్థిక ఇబ్బందుల్ని, ఇతర అడ్డంకుల్ని అధిగమించి ఆటలో ఎదిగింది. ఆసియా గేమ్స్‌లో అద్భుతం చేసింది. ఆమె రెండు కాళ్లలోనూ అదనంగా ఒక్కో వేలు ఉంటుంది. మామూలు బూట్లు ధరిస్తే ఈ వేళ్ల వల్ల పరుగు తీస్తున్నపుడు, సాధన చేస్తున్నపుడు విపరీతమైన నొప్పి ఉంటుంది.
ఎన్నో రకాలు షూలు ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రత్యేకంగా షూలు డిజైన్ చేయించుకునే స్థోమత ఆమెకు లేదు. అయినా పాత షూటలతో ఇబ్బంది పడుతూనే అలాగే ఆసియా గేమ్స్‌కు వచ్చింది. అలాగే పోటీల్లోనూ పాల్గొంది. స్వప్న చిన్నప్పట్నించి మొండిఘటం. ఒకసారి అనుకుంటే దానిని సాధించకుండా వదిలిపెట్టే రకం కాదు.
పతకం గెలవకుంటే ఇంటికి రావొద్దు అని తన తల్లి చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఏకంగా స్వర్ణంతో మెరిసింది. దీనికి తోడు కొన్ని రోజుల నుంచి ఆమెను పంటి నొప్పి వేధిస్తోంది. ఒక దశలో పోటీలో పాల్గొనడమే కష్టంగా మారింది. అయినప్పటికీ స్వప్న పట్టు వీడలేదు. నొప్పి బాధ తగ్గించుకునేందుకు ఒక బుగ్గలపై ఒక ప్లాస్టర్ వేసుకుని బరిలోకి దిగిందామె. కాళ్లలో, నోటిలో బాధను భరిస్తూనే పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం గెలిచింది.