
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా శనివారం ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై బాక్సింగ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 22 ఏళ్ల బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణ పతకం సాధించాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
స్వర్ణ పోరులో రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, ఉజకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దస్మోస్తవ్‌ను 3-2 తేడాతో అమిత్ పంగల్ చిత్తుగా ఓడించాడు. తద్వారా ఈ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి ఏకైక భారత బాక్సర్‌గా అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు. తాజా స్వర్ణంతో భారత్ ఖాతాలో స్వర్ణాల సంఖ్య 14కు చేరింది.

ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన అమిత్.. తొలి రెండు రౌండ్లను ఖాతాలో వేసుకున్నాడు. దూకుడుగా ఆడే హసన్‌బాయ్‌ను అదే మంత్రంతో మట్టికరిపించాడు. అమిత్ చివర్లో కాస్త తడబడ్డాడు.. కానీ అప్పటికే మ్యాచ్ ఫలితం అతడి వైపు వైపు మొగ్గు చూపింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్లో పాలమ్‌పై అమిత్ 3-2 తేడాతో విజయం సాధించాడు.
హర్యానాకు చెందిన అమిత్ ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బాక్సర్లు పసిడి పతకం నెగ్గడంలో విఫలమైనా 22 ఏళ్ల అమిత్ పంగల్ ఆ లోటును తీర్చాడు. తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 66కు చేరింది. ఫలితంగా ఆసియా గేమ్స్ చరిత్రలో భారత్ 66 పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్ ఈవెంట్లలో భారత్‌కు దక్కిన తొలి బంగారు పతకం ఇదే కావడం విశేషం. ఈ గేమ్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. పురుషుల 75 కేజీల ఈవెంట్‌లో వికాస్ యాదవ్ కాంస్యం నెగ్గగా.. అమిత్ పంగల్ స్వర్ణం పతకం సాధించాడు.