
బాసెల్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలిచి తొలి భారత షట్లర్‌గా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నజరానా ప్రకటించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై 21-7, 21-7 తేడాతో ప్రపంచ ఇదో ర్యాంకర్ సింధు ఘన విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో మ్యాచ్ గెలిచి కొత్త చరిత్ర లిఖించింది.
ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు బాయ్ రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. చాంపియన్‌లో భారత ఆటగాళ్లు పతకాలు సాధించడం దేశానికి గర్వ కారణం అని బిశ్వశర్మ అన్నారు.
ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఈ విజయంతో ఒకుహారాపై ముఖాముఖి రికార్డులో సింధు ఆధిక్యాన్ని 9-7కు పెంచుకుంది. ఇక 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది.
మహిళల సింగిల్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన సింధుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, తెలంగాణ గవర్నర్ నరసింహన్, ఏపీ గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 'సింధు సాధించిన విజయాన్ని చూసి భారత్ మరోసారి గర్విస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు అభినందనలు. అంకితభావం, పట్టుదలతో విజయం సాధించి స్ఫూర్తిగా నిలిచింది' అని ప్రధాని ట్వీట్ చేశారు.