
సింధు జోరు
ఒకానొక దశలో కిమ్ 8-12తో భారత షట్లర్‌ను సమీపించింది. ఈ స్థితిలో విజృంభించిన సింధు వరుస పాయింట్లతో అంతరాన్ని పెంచుకుంది. చివరికి 21-16తో తొలి గేమ్ గెలిచింది. విశేషం ఏమిటంటే ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ సింధు తన జోరు కొనసాగించింది.
ఆరంభంలోనే 8-3తో ఆధిక్యంలోకి మ్యాచ్‌పై పట్టు బిగించిన సింధు ఆ తర్వాత అదే దూకుడుతో 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఎవెగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)-చెయింగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)ల మధ్య మ్యాచ్ విజేతతో సింధు మూడో రౌండ్‌లో తలపడుతుంది.
సోమవారం ఆలస్యంగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జాతీయ ఛాంపియన్ రితుపర్ణా దాస్ కూడా ముందంజ వేసింది. తొలి గేమ్‌లో రితుపర్ణా దాస్ 2-0తో అరి మికెలా (ఫిన్లాండ్)పై ఆధిక్యంలో సమయంలో ప్రత్యర్థి గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది.

సాయి ప్రణీత్, అజయ్ జయరామ్ ముందజ:
పురుషుల సింగిల్స్‌లో 15వ సీడ్ సాయిప్రణీత్ 21-18, 21-17తో వీ నాన్ (హాంకాంగ్)పై, 13వ సీడ్ అజయ్ జయరామ్ 21-14, 21-12తో లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. తొలి గేమ్‌లో ఒక దశలో 5-9, ఆ తర్వాత 14-16తో వెనకబడిన ప్రణీత్ ఆ తర్వాత పుంజుకుని 21-18తో గెలిచాడు.
ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ రెండో రౌండ్‌లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ఆడతాడు. మ్యాచ్ అనంతరం ‘మ్యాచ్ కఠినంగా ఉంటుందని ముందే అంచనా వేశాను. వెనుకబడిన దశలో నా వ్యూహాన్ని మార్చాను. వీ నాన్ కొన్ని పొరపాట్లు చేయడంతో నేను వాటిని సద్వినియోగం చేసుకున్నాను' అని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు.
మరో మ్యాచ్‌లో 13వ సీడ్ అజయ్ జయరాం 21-14, 21-12తో లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు.

డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు:
డబుల్స్ విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-12, 21-19తో ప్రాజక్తా సావంత్ (భారత్)-యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని-సుమీత్‌రెడ్డి 17-21, 21-18, 5-21తో వాంగ్-హుయాంగ్ (చైనా) చేతిలో ఓడింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-అశ్వని ద్వయం 21-15, 21-13తో రిరిన్ అమెలియా (ఇండోనేసియా)-చింగ్ చెయోంగ్ (మలేసియా) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి జోడీ 8-21, 12-21తో హిరోయుకి ఎండో-వతనాబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది.

లీ చాంగ్ వీకి షాక్:
పురుషుల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రన్నరప్, మాజీ నెంబర్ వన్ లీ చాంగ్ వీ (మలేసియా)కి షాక్ తగిలింది. తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్) 21-19, 22-24, 21-17తో రెండోసీడ్ లీ చాంగ్ వీ ఓటమి పాలయ్యాడు.


Click it and Unblock the Notifications











