
హైదరాబాద్: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ఓటమితో వెనుదిరిగాడు. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మలేషియా షట్లర్ డారెన్ లివ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 18-21, 18-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి రికార్డులు నెలకొల్పిన కిదాంబి శ్రీకాంత్ భారీ అంచనాల మధ్య ఈ టోర్నీలోకి అడుగుపెట్టాడు. ప్రీ క్వార్టర్స్‌లోనే కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగియడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. టోర్నీలో భాగంగా గత మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఐర్లాండ్ షట్లర్ నాట్ నుయెన్‌ని 21-15, 21-16 తేడాతో వరుస సెట్లలో శ్రీకాంత్ ఓడించాడు.
అనంతరం బుధవారం జరిగిన రెండో రౌండ్‌లోనూ తన జోరు కొనసాగించాడు. స్పెయిన్‌కి చెందిన పాబ్లోని 21-15, 12-21, 21-14 తేడాతో ఓడించి ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, ఈ మ్యాచ్ రెండో సెట్‌లో కాస్త తడబడిన శ్రీకాంత్ మూడో సెట్‌లో జోరు పెంచాడు. ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ, చివర్లో మాత్రం అనవసర తప్పిదాలతో పాయింట్లు చేజార్చుకుని ఒత్తిడి పెంచుకున్నాడు.
మరోవైపు, గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ రత్‌చనోక్ ఇంతనోన్‌పై వరుస గేమ్స్‌లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సుమారు 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా 21-16, 21-19 తేడాతో విజయం సాధించింది.