హైదరాబాద్: పతకం రంగు మారుస్తానని ధీమా వ్యక్తం చేసిన రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరింది. ముచ్చటగా మూడో ప్రయత్నంలో సింధు ఫైనల్‌కు చేరడం విశేషం. సెమీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీపై విజయం సాధించి తొలిసారి ఫైనల్ చేరింది.
శనివారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీపై రెండు వరుస సెట్లలో 21-13, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. 8-8తో స్కోరు సమమైన సమయంలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 11-8తో బ్రేక్‌కు వెళ్లింది.

ఆ తర్వాత కూడా అదే జోరును ప్రదర్శించి 21-13తో తొలి గేమ్‌ను నెగ్గింది. ఇక రెండో గేమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పీవీ సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 21-10తో గెలిచింది. దీంతో సింధుకు వరల్డ్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం లేదా రజత పతకం దక్కే అవకాశం ఉంది.
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధుకు మెడల్ రావడం ఇది మూడవ సారి అవుతుంది. 2013, 2014 సంవత్సరాల్లో సింధూకు ఈ టోర్నీలో కాంస్య పతకాలను సాధించింది. కాగా, ఫైనల్‌లో జపాన్‌కు చెందిన ఒకుహరాతో సింధు తలపడనుంది. మరోవైపు సైనా సెమీఫైనల్‌లో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.