హైదరాబాద్: బ్యాడ్మింటన్ సంచలన క్రీడాకారిణి జ్వాలా గుత్తా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో ఆమె క్లోజ్‌గా ఉంటున్నట్లు చెబుతున్నారు.
బ్యాడ్మింటన్ క్రీడతో తాను విసిగిపోయానని ఆమె ఇటీవల చెప్పారు. అదే సమయంలో ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డుల విషయంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ స్థితిలో రాజకీయాల్లో తన జాతకాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.

అన్నీ కుదిరితే తెరాసలో చేరి పార్లమెంటుకు పోటీ చేసే ఉద్దేశంతో జ్వాలా ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అది కాకపోతే మాల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు సికింద్రాబాదుకు ప్రస్తుతం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెరాసకు ఆ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేరు. దీంతో బ్యాడ్మింటన్ స్టార్, గ్లామర్ ఇమేజ్ గల జ్వాలా గుత్తాను రంగంలోకి దింపుతారా అనేది చూడాల్సే ఉంది. అయితే, జ్వాలా తండ్రి మాత్రం ఆమె రాజకీయ ప్రవేశం ఉండదని తమతో చెప్పినట్లు ఆంధ్రజ్యోతి మీడియా రాసింది.