హైదరాబాద్: తాను ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ప్రోత్సాహకం అందలేదని బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికవడం ఆనందంగా ఉందన్న సైనా.. తెలంగాణ వ్యక్తిగా గర్విస్తున్నానని చెప్పింది.
అయితే దేశం కోసం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినా తన(తెలంగాణ) రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు నగదు బహుమతి అందకపోవడం బాధగా ఉందని గురువారం తన ట్విట్టర్ ఖాతాలో సైనా నెహ్వాల్ పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన సైనాకు నిబంధనల ప్రకారం రూ. 50 లక్షలు రావాల్సి ఉంది.

సైనాతోపాటు గగన్ నారంగ్(రూ. 50లక్షలు), కబడ్డీ క్రీడాకారిణులు మమత పూజారి, నాగలక్ష్మి(చెరో రూ. 25లక్షలు)లకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో) ఆర్థిక శాఖ గత మే నెలలో ఆమోదం తెలిపింది. అయితే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీరిక లేకుండా సమావేశాలు, సమీక్షలతో గడుపుతుండటంతో తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చెక్కులు అందజేసే తేదీని నిర్ణయించలేదని రాష్ట్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని సైనా నెహ్వాల్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె తారక రామారావు హామీ ఇచ్చారు. సైనా ట్వీట్లకు స్పందించిన ఆయన.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మిగితా క్రీడాకారులు కూడా తమకు గర్వకారణమని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా స్పందించిన సైనా నెహ్వాల్ ధన్యవాదాలు తెలిపింది. మీకు వెల్‌కమ్ అని కెటిఆర్ మరో ట్వీట్ చేశారు.