
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉందని తెలుగు తేజం పీవీ సింధు వెల్లడించింది. సోమవారం నగరంలోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో జరిగిన ఓ కార్యక్రమంలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, కోచ్ గోపీచంద్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీసీలో ఎయిర్ కండిషన్డ్ బ్యాడ్మింటన్ కోర్టుల్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. అనంతరం సింధు, కిదాంబి శ్రీకాంత్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో 11-9తో తొలి గేమ్‌ను సింధు గెల్చుకోగా.. 11-7తో రెండో గేమ్‌ను శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 10-10తో పాయింట్లు సమంకాగానే చెయిర్ అంపైర్ వేమూరి సుధాకర్... సింధు, శ్రీకాంత్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) అధ్యక్షుడు సింధు, శ్రీకాంత్‌లకు ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యత్వం అందజేశారు. సభ్యత్వం ఇచ్చినందుకు ఎఫ్‌ఎన్‌సీసీకి సింధు, శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ 'కామన్వెల్త్ క్రీడలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాం. మరో ఐదు రోజుల్లో గోల్డ్‌కోస్ట్‌కు బయల్దేరుతాం. కామన్వెల్త్ క్రీడల్లో మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. డ్రా ఇంకా విడుదల కాలేదు. భారత జట్టు మాత్రం ఈసారి పటిష్టంగా ఉంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు' అని తెలిపింది.
'చైనా, జపాన్ క్రీడాకారులు లేకపోయినా మిగతా వాళ్ళను తేలిగ్గా తీసుకోం. ఇంగ్లాండ్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ క్రీడాకారులు బాగా ఆడతారు. టీమ్ ఈవెంట్లో ఏదైనా జరగొచ్చు. ఆరు స్వర్ణాల్లో ఎక్కువ భాగం భారత్ గెలవొచ్చు. బహుశా భారత జట్టుకు నాలుగు స్వర్ణాలు గెలిచే అవకాశం ఉంది' అని సింధు చెప్పింది.