బెంగళూర్: వేరేవాళ్ల వద్ద తాను శిక్షణ తీసుకోవాలనుకోవడంలోని తప్పేమిటని హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రశ్నించారు. పుల్లెల గోపీచంద్‌కు దూరమై బెంగళూర్‌లో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయించుకోవడంపై దుమారం చెలరేగింది. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె మాట్లాడారు.
దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం యు. విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవడాన్ని సైనా అప్పుడే ప్రారంభించారు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకే విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందులో తప్పేముందని ఆమె అన్నారు.

తాను విమల్ కుమార్ వద్ద రెండు వారాల పాటు శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నంత మాత్రాన గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకోబోనని కాదని ఆమె స్పష్టం చేశారు. 2006 నుంచి తాను గోపీచంద్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు ఆమె తెలిపారు. ట్రైనింగ్ షెడ్యూల్‌లో మార్పు కావాలని అనుకున్నానని, ఇది ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలని ఆమె అన్నారు.
తాను బెంగళూర్‌కు వెళ్లిపోలేదని, వెళ్లిపోవడం లేదని, రెండు వారాల కోసం బెంగుళూర్‌లో ఉటానని, తన తల్లి ఇక్కడికి వస్తారని ఆమె చెప్పారు. విమల్ కుమార్ శిక్షణ తనకు పనికి వస్తుందేమో చూడాలని అనుకుంటున్నానని సైనా చెప్పారు. ఆ విషయంపై గోపీచంద్‌తోనూ విమల్‌తోనూ మాట్లాడానని చెప్పారు.