హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో మరి కొన్ని గంటల్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పివి సింధు, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ల ఫైనల్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ మ్యాచ్ భారతీయులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత షట్లర్ పీవీ సింధు గెలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజత పతకంతో సగర్వంగా భారత్‌కు తిరిగి వస్తుంది. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
గురువారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘన విజయాన్ని సాధించింది. దీంతో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం రాత్రి 6.55 నిమిషాలకు జరగనుంది. ఇప్పటివరకూ ఈ ఇద్దరు క్రీడాకారిణులు ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా మారిన్ నాలుగు, సింధు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. 2015 అక్టోబర్‌లో డెన్మార్క్ ఓపెన్‌లో మారిన్‌ను సింధు ఓడించగా, అదే ఏడాది నవంబర్‌లో జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లో సింధుపై మారిన్ గెలిచింది.
ఫైనల్‌లో సింధు మారిన్‌ను అడ్డుకునేనా?
ఇప్పటి వరకు సింధు తన క్రీడా కెరీర్‌లో 184 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 86 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక మారిన్ విషయానికి వస్తే 239 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 74 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. మారిన్ విజయాల శాతం 76.36గా ఉండగా, సింధు విజయాల శాతం 67.00 గా ఉంది.

ఈ నేపథ్యంలో సింధు తన ఫైనల్ ప్రత్యర్ధిని కట్టడి చేయగలదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాదు మారిన్ అతి తక్కువ కాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేసింది. 23 ఏళ్ల మారిన్ 2014, 2015లలో ప్రపంచ ఛాంపియన్ షిప్‌లలో స్వర్ణాలను సాధించింది.
ఆల్ ఇంగ్లాండ్‌తో పాటు పలు సూపర్ సిరిస్ టైటిళ్లను గెలుచుకుంది. ప్రపంచ బాడ్మింటన్‌లో చైనా, జపాన్ క్రీడాకారులది అందవేసిన చేయి. అయితే సైనా, సింధుల తర్వాత చైనా, జపాన్ క్రీడాకారిణులకు మారిన్ చుక్కలు చూపించిన ఘనత కూడా దక్కించుకుంది.
దీంతో పాటు మారిన్ 19 టైటిల్స్ సాధించగా, సింధు మూడు టైటిల్స్ మాత్రమే సాధించింది. 21 ఏళ్ల సింధు 65 కేజీల బరువుతో పాటు, 5.8 అడుగుల ఎత్తు కలిగి ఉండగా, 23 ఏళ్ల మారిన్ 65 కేజీల బరువు, 5.6 అడుగుల ఎత్తు ఉంది. సింధు 2012లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించగా, మారిన్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
అంతేకాదు మారిన్‌ది ఎడమ చేతి వాటం. పాయింటు పాయింటుకు ప్రత్యర్ధిని మానసికంగా కుంగదీయడంలో దిట్ట. కానీ ఈ మధ్య కాలంలో సింధు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. రెట్టించిన ఉత్సహంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తోంది.
రియో ఒలింపిక్స్‌లో సింధు ఫామ్‌ను చూస్తుంటే తన ముందు ఎలాంటి ప్రత్యర్ధి ఉన్నా బలాదూరే అన్న అభిప్రాయం కలగకమానదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కేవలం గంటలోనే మ్యాచ్ మొత్తాన్ని తనవైపుకు తిప్పేసుకుంది. ఇదే ఫామ్‌ను సింధు కొనసాగిస్తే, ఫైనల్‌లో మారిన్‌పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకోవడం ఖాయం.
సింధుకే స్వర్ణం అంటున్న జ్యోతిష్యులు
సింధు జన్మనక్షత్రం ప్రకారం రియో ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. 5 జూలై 1995న హైదరాబాద్‌లో జన్మించిన సింధు 8 ఏళ్ల వయసు నుంచే బాడ్మింటన్ ఆడినా, 13 ఏళ్లకు పూర్తి బాడ్మింటన్ ప్రొపెషనల్‌గా మారింది.