బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెకండ్ రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ 19-21, 17-21 తేడాతో ఇండోనేషియా ఆటగాళ్లు మహ్మద్ అహ్సన్, హెంద్ర సెతివాన్ చేతిలో ఓటమిపాలైంది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో సాత్విక్, చిరాగ్ కొంత పోటీ ఇచ్చినా తర్వాతి సెట్లో పూర్తిగా వెనుకపడిపోయారు. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
అంతకుముందు సౌత్ కొరియా ఆటగాళ్లు కిమ్ గి జంగ్, లీ యాంగ్తో తొలి రౌండ్లో తలపడిన సాత్విక్, చిరాగ్ జోడీ 19-21, 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ చేజార్చుకున్నా.. చివరి రెండు సెట్లలో విజయం సాధించారు. కానీ సౌత్ కొరియా జోడీపై భారత ఆటగాళ్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు.
ఇక ఈ టోర్నీలో పీవీ సింధు తొలిరౌండ్లోనే ఓడి నిరాశపరిచినా.. మరో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసి మహిళల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచింది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేసిన విషయం తెలిసిందే.
బుధవారం జరిగిన మొదటిరౌండ్లో సైనా 21-15,21-15తో మలేసియాకు చెందిన సెల్వాదూరె కిసోనాపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మను ఓడించి రెండోరౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రత్యర్థి జాసన్ ఆంథోనీ హో షూ (కెనడా) 21-9, 13-21, 14-8తో ఆధిక్యంలో ఉన్నప్పుడు పారుపల్లి కశ్యప్ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్ వర్మ 15-21, 17-21తో షెసార్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.