థాయ్‌లాండ్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌కు షాక్ ఎదురైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌లో పరాజయంపాలై అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మిథున్ మంజునాథ్‌తో జరిగిన పోరులో 9-21, 21-13, 17-21తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో పేలవ ప్రదర్శన చేసిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆధిపత్యం చెలాయించలేకపోయాడు.
మరోవైపు ఈ టోర్నీలో ఇండియా స్టార్ జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ సత్తాచాటుతోంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు ఈ జంట అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీపై 21-15, 24-22తో విజయం సాధించింది. తొలి గేమ్ నుంచే ప్రత్యర్థి జోడీపై గాయత్రి-ట్రీసా పైచేయి సాధిస్తూ ఆటను కొనసాగించింది. కాగా, తర్వాతి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన నాలుగో సీడ్ ఫెబ్రియానా ద్విపూజీ కుసుమ- అమలియా కహయాతో తలపడనున్నారు.

గురువారం జరిగిన మరో మ్యాచ్‌ల్లో శంకర్ ముత్తుసామి, మాళవిక బాన్సోద్ ఓటమి చవిచూశారు.. చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ చేతిలో శంకర్ ముత్తుసామి 9-21, 11-21తో ఓడిపోయాడు. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 22-24, 7-21 తేడాతో ఓటమిపాలైంది. అయితే మహిళల సింగిల్స్‌లో అష్మిత చాలిహా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొపై ఆమె 21-12, 15-21, 21-17తో విజయం సాధించింది.