హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్లకు మద్దతు తెలుపుతున్న కోట్లాది మంది భారతీయులకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సచిన్ టెండూల్కర్ రియోలో భారత షట్లర్ పీవీ సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించాడు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
సింధు ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సచిన్ పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో సింధు స్వర్ణం గెలవాలని యావత్ భారతావని కోరుకుంటోందని సచిన్ తెలిపాడు. రియోలో సింధు అద్భుతమైన ఫామ్‌లో ఉందని, స్వర్ణం సాధించడం ఖాయమని సచిన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్‌కు సచిన్ అభినందనలు తెలిపాడు. సాక్షిని చూసి దేశమంతా గర్విస్తోందని సచిన్ పేర్కొన్నాడు. భారత్ తరుపున రియో ఒలింపిక్స్‌కు సచిన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత్ మొత్తంగా 6 పతకాలను సాధిస్తే ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ఒక్క పతకం మాత్రమే సాధించింది. కాగా, శుక్రవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత షట్లర్ పీవీ సింధు గెలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజత పతకంతో సగర్వంగా భారత్‌కు తిరిగి వస్తుంది.